Godavari is Being Polluted with Garbage in Bhadrachalam : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం కాలుష్యం బారిన పడుతోంది. చెత్త వేయడానికి స్థలం లేక పవిత్ర గోదావరి ఒడ్డునే కాల్చుతున్నారు. జల, వాయు కాలుష్యంతో రామయ్య సన్నిధి కాలుష్యపు కాటుకు గురవుతోంది. సమస్య పరిష్కారానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు జరగటం లేదు. సుదూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు చెత్తను కాల్చిన పొగతో ఇబ్బంది పడుతున్నారు.
భద్రాచలాన్ని చెత్త సమస్య వేధిస్తోంది. పట్టణంలో సేకరించే చెత్తను గోదావరి కరకట్ట వద్ద వేసి ఆ తర్వాత కాల్చేస్తున్నారు. సుభాష్ నగర్, ముదిరాజ్ కాలనీ, రామాలయం సెంటర్, సూపర్ బజార్ సెంటర్ కాలనీల్లో ప్రజలు పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి ఆలయం వాయు కాలుష్యంబారిన పడుతోందని పురోహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి కాలుష్యం : రాష్ట్ర విభజనకు ముందు ఎటపాకకు చెత్త తరలించేవారు. భద్రాచలానికి దూరంగా ఉందని ప్రస్తుతం గోదావరి కరకట్ట పక్కనే చెత్త పడేసి కాల్చేస్తున్నారు. ఆ వ్యర్థాలు కలవడం వల్ల గోదావరి కాలుష్యమవుతోంని దిగువ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆదర్శ్‌నగర్ కాలనీలోని 8 ఎకరాల్లో రీసైక్లింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
"పుణ్యక్షేత్రం అన్ని పుణ్య కార్యక్రమాలే జరుగుతాయని భక్తులకు విశ్వాసం. అలాంటి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. గ్రమాపంచాయతీ వారి నిర్లక్ష్యం వల్ల డంపింగ్ యార్డ్ పొగ రాములవారి శిఖరాన్ని తాకుతుంది. రాములవారి సుదర్శనం కూడా నల్లబడిపోతుంది. వెంటనే అధికారులు దీనికి తగిన చర్యలు తీసుకోవాలి." - పురోహితులు, భద్రాచలం
అందుబాటులోకి రావాల్సిన రిసైక్లింగ్ : యార్డులోని షెడ్ల నిర్మాణానికి, ట్రాన్స్‌ఫార్మర్లకు రూ.కోటి 50 లక్షలు అవసరమని అంచనా వేశారు. ఇందుకోసం సర్కారు నుంచి నిధులు రాకపోయినా పంచాయతీ నుంచే రూ.80 లక్షలు ఖర్చు చేసి షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు ఐదు యంత్రాలు కొన్నారు. ఇంకొక యంత్రం రావాల్సి ఉంది. రీసైక్లింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తే గోదావరి కరకట్ట వద్ద చెత్త వేసే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భద్రాచలం చెత్త సమస్యపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సీతారాముల కల్యాణానికి ఖరారైన ముహూర్తం - నవమి వేడుకల వివరాలు ప్రకటించిన భద్రాద్రి ఆలయం