GMC Going to Siege Green Grace Apartment Owned by Ambati Murali : మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో గుంటూరు నగరపాలక సంస్థ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నోటీసుకు నిర్దేశిత గడువు ముగిసినా నిర్మాణదారుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆ నిర్మాణం డిమాలిషన్ లేదా సీజ్ చేసే యోచనలో నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది.
వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీకృష్ణ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడుగడుగునా నిబంధనలను అతిక్రమిస్తూ గుంటూరులోని పట్టాభిపురంలో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో తేలింది. పట్టాభిపురం ప్రధాన రహదారి వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టే క్రమంలో నగరపాలక, రైల్వేశాఖ, అగ్నిమాపక, పీసీబీ శాఖల నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోలేదు.
నగరపాలక సంస్థకు ఫీజులు కూడా చెల్లించలేదు. జీ+4కు మాత్రమే ఎన్‌వోసీ ఇచ్చిన రైల్వేశాఖ అంతకుమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి ఏడాది క్రితమే ఎన్‌వోసీని తిరిగి రద్దు చేసుకుంది. ఆ విషయాన్ని నగరపాలక సంస్థకు తెలియజేసింది. కానీ అప్పట్లో తన అన్న అంబటి రాంబాబు మంత్రి కావటంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుమతులు లేకపోయినా అంబటి మురళి చకచకా నిర్మాణాలు కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైల్వేశాఖ నుంచి ఎన్ఓసీ (NOC) నగరపాలక నుంచి అనుమతులు లేకపోయినా అక్రమ భవనంపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించటంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నగరపాలక సంస్థ ఆ నిర్మాణాలకు అనుమతులు పక్కాగా లేవని నిర్ధారించింది. రైల్వేశాఖ ఏడాది క్రితమే ఎన్ఓసీని రద్దు చేసినప్పటికీ నిర్మాణదారుడు రివైజ్డ్ ప్లాన్‌కు పెట్టుకుని నగరపాలక సంస్థను మోసగించారు. తొలుత జీ+4 నిర్మాణానికి ఇచ్చిన ఎన్ఓసీ ధ్రువపత్రాన్నే చూపించి రివైజ్డ్ ప్లాను కోరారు. ఈ మోసం అధికారుల పరిశీలనలో బయటపడింది.
ఈ నిర్మాణం విషయంలో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ నగరపాలక సంస్థను పలు విధాలుగా మోసగించినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో బాధ్యుడైన లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ కేఎస్‌ఆర్ అసోసియేట్స్ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదుకు కమిషనర్ ఆదేశించారు. రద్దయిన రైల్వే ఎన్ఓసీ పత్రాన్ని అప్లోడ్ చేయటం ఒక తప్పిదమైతే, సాయిల్ టెస్ట్ రిపోర్ట్సు, స్ట్రక్చరల్ డిజైన్స్ కాపీలు కూడా గతంలో జీ+4కు అనుమతులు పొందినప్పుడు ఏవైతే పెట్టారో అవే డాక్యుమెంట్స్‌ను రివైజ్డ్ ప్లాన్‌లో పెట్టి నగరపాలక సంస్థను లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ మోసగించినట్లు గుర్తించారు.
గత కొంతకాలం నుంచి భవన అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే మంజూరవుతుండటంతో పాత డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినా ప్లాన్ అఫ్రూవ్ అయిపోయింది. అయితే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు రాకపోవడంతో ఈ లొసుగులు గతంలో బయటపడలేదు. అగ్నిమాపక ఎన్‌వోసీ కూడా గ్రీన్ గ్రేస్‌పై లేదు. అన్నింటికి మించి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఫీజులు బకాయిలు పెట్టారు. వీటన్నింటి నేపథ్యంలో అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో సమాధానమివ్వాలని గత నెల 18న షోకాజ్ నోటీసులు పంపినట్లు నగరపాలక సంస్థ అధికారులు ధ్రువీకరించారు.
గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణ అనుమతుల అంశంపై నిర్మాణదారుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆ నిర్మాణాలపై రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నగరపాలక సంస్థను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు నుంచి రాతపూర్వక ఆదేశాలు అందలేదని అవి వస్తే వేచి చూస్తామని లేకపోతే డిమాలిషన్ లేదా ప్రాసిక్యూషన్‌కు చర్యలు చేపడతామని నగరపాలక సిబ్బంది తెలిపారు.
గుంటూరులో గ్రీన్‌గ్రేస్ నిర్మాణాలపై విజి'లెన్స్' - రైల్వేశాఖ లేఖను దాచిందెవరో?