Girl Murder Case Accused Committed Suicide: రాష్ట్రంలో కలకలం రేపిన అనకాపల్లి జిల్లా విద్యార్థిని హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివారులో నిందితుడు సురేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సురేశ్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని డీఎస్పీ పరిశీలించారు. మృతుడి దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన వెల్లడించారు. బాలికను హత్యచేసిన రోజు రాత్రి లేదా తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్లుందని డీఎస్పీ తెలిపారు.
తనను జైల్లో పెట్టించిందని కక్ష పెంచుకుని ఈ నెల 6న 9వ తరగతి విద్యార్థిని దర్శినిని ప్రేమోన్మాది సురేశ్ దారుణంగా హత్య చేశాడు. ఏడాదిగా ఆమె వెంటపడుతుండటంతో బాలిక ఇంట్లో ఈ విషయం చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. ఈ మధ్యనే బెయిల్‌పై వచ్చిన నిందితుడు బాలికను ఆమె ఇంటిలోనే కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు.
బెయిల్‌పై తిరిగొచ్చి బాలికను హతమార్చాడు- ప్రేమోన్మాది ఘాతుకం - MINOR GIRL murder
బాలిక హత్యపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌ను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. అప్పటి నుంచి నిందితుడి కోసం 14 పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు.
ఇదిలా ఉండగా నిందితుడి మృతదేహం ఇవాళ గ్రామ శివారులో కనిపించింది. బాగా కుళ్లిన స్థితితో ఉన్న మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహం పక్కనే కూల్ డ్రింక్ సీసా ఉండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.