Ghmc Planning To Start Dumping Yards In Hyderabad: రాష్ట్ర రాజధానిలో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. నగర నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 7 వేల 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అదనంగా మరో 17 మున్సిపాలిటీల చెత్తను కూడా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు రోజు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
డంపింగ్ యార్డుల స్థలాల గుర్తింపు : హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అధికారుల బృందం పర్యటించి డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారం గ్రామంలో 100 ఎకరాలు, దుండిగల్‌లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు గుర్తించారు. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూములను జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు.
హైదరాబాద్‌లో శుద్ధి కేంద్రాలు : అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే గుర్తించిన ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో వినూత్న, ఆధునిక పద్దతైన యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మూసి ఉండే ట్రక్కుల ద్వారా రవాణా చేసిన వ్యర్థాలను అండర్ గ్రౌండ్ బంకర్లో వేసి తడి పొడిగా వేరు చేసిన అనంతరం పొడి వ్యర్థాల నుంచి విద్యుత్తు, తడి వ్యర్థాల నుంచి సీబీజీ గ్యాస్‌ను తయారు చేస్తారు.
నగరం చుట్టూ డంపింగ్ యార్డులు : ఈ క్రమంలో శుద్ధి కేంద్రంలో ఎక్కడ కూడా చెత్తను నిల్వ చేయడం, బహిరంగంగా శుద్ధి చెయ్యడం జరగదు. అందువల్ల ఎలాంటి దుర్వాసన, వ్యర్థ జలాలు విడుదల కావు. పూర్తిగా మూసి ఉండే షెడ్డు లోపల ప్రక్రియ అంతా జరగడం, గాలిని కూడా బయోఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పునర్వినియోగించడం వల్ల ఎలాంటి దుర్వాసన బయటికిరాదు. ఈ విధానంలోనే ప్రతిపాదన స్థలాల్లో కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి జవహర్‌నగర్ పై ఒత్తిడి తగ్గించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి స్థలాలను కేటాయిస్తే చెత్త నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మిగతా నగరాల కంటే మరింత ముందంజలో ఉండనుంది.
ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? - ఐతే అంతే సంగతులు - GARBAGE THROWING ON ROADS IN HYD