GHMC Commissioner On Firecrackers : నగరంలో ఈ దీపావళి పండగకు బాణాసంచా విక్రయించే దుకాణాదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. రిటైల్ దుకాణాలకు 11 వేలు, హోల్ సేల్ దుకాణాలకు 66 వేల రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు కమిషనర్ ప్రకటించారు. బాణాసంచా దుకాణాలను పుట్ పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.
అలాగే స్టాల్స్‌కు ఏర్పాటు చేసే విద్యుత్‌కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందుకు వాటి యజమానులదే బాధ్యత ఉంటుందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. కాలనీ, బస్తీలకు దూరంగా మైదానాలు, పెద్ద హాల్స్‌లో తగిన ఫైర్ సేప్టీతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కొరకు సిటిజన్ సర్వీస్ సెంటర్, జిహెచ్ఎంసి వెబ్సైట్ www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులు, న్యాయస్థానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. సిరీస్ క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం ఉందని వాటి అమ్మకాలకు అనుమతి లేదని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారుల తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేస్తామని కమిషనర్ ఇలంబర్తి హెచ్చరించారు. అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు.
"ట్రేడ్ లైసెన్స్‌తోనే బాణాసంచా విక్రయాలు జరపాలి. రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు,హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి. బాణాసంచా దుకాణాలను ఫుట్ పాత్, జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దు. స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే స్టాల్ హోల్డర్దే బాధ్యత. దుకాణాలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద హాల్స్‌లో తగిన ఫైర్ సేప్టీతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి." -ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్
Diwali Precautions: ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
'దీపావళి'కి సొంతూరుకు వెళ్తున్నారా? - మీ కోసమే 804 స్పెషల్ ట్రైన్లు