GHMC Letter To Government To Allow Ban On Mayonnaise In Hyderabad : ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) సిద్ధమైంది. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, తదితర ఆహార వాటిలో చెట్నీలా వేసుకుని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మయోనైజ్‌ను నిషేధించేందుకు అనుమతి కోరడం గమనార్హం.
వరుస ఘటనలు : మేడ్చల్ జిల్లా అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్‌లో నాసిరకం మయోనైజ్‌ను తిన్న కొంత మంది యువకులు ఇటీవల ఆసుపత్రిపాలయ్యారు. వారం కిందట 5 మందికి వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 10 (10-01-2024)న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అదే హోటల్‌లో షవర్మ తిన్న 20 మందికి పైగా యువకులు 3, 4 రోజులు అయ్యాక సమీప హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కొంతమందికి రక్త పరీక్షలు చేయగా హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చి చెప్పారు. ఆ హోటల్‌లోని షవర్మ బాగోలేదని బల్దియాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.
మయొనైజ్ ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు! - Mayonnaise Health Effects
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌లోని ఓ హోటల్‌లో, బంజారాహిల్స్, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్‌లోని పలు హోటళ్లలోని మండి బిర్యానీ, బర్గర్ల, షవర్మపైనా బల్దియాకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిపిన తనిఖీల్లోనూ నాసిరకం మయోనైజ్‌ను సంబంధిత అధికారులు గుర్తించారు. మయోనైజ్ ఉడికించన పదార్థమైనందున హానికర బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఈ పదార్థాన్ని నిషేధించి, శాఖాహార పదార్థాలతో చేసే మయోనైజ్‌ను ప్రొత్సహించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఓ అధికారి ఈటీవి భారత్‌కు తెలియజేశారు.
తయారీ విధానంలో నిర్లక్ష్యం : ఈ పదార్థాన్ని గుడ్డులోని పచ్చసొన, నూనె, ఉప్పు, నిమ్మరసంతో తయారు చేస్తారు. ఈ క్రమంలో చాలా మంది శుభ్రతను పాటించడం లేదు. కొన్ని గుడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో అది వంట మనిషి చేతులకు అంటుకుంటుంది. అలాగే కొన్ని రకాల ముడి పదార్థాలను తీసుకుని గుడ్డు సొనలో కలుపుతారు. అలా తయారైన మయోనైజ్ చాలా ప్రమాదకరమని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఇలాంటి తప్పులేవీ జరగకుండా పరిశుభ్రంగా తయారైన మయోనైజ్‌ను మాత్రమే తినేందుకు ఉపయోగించాలని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా తయారైన మయోనైజ్‌ను 3 నుంచి 4 గంటల్లోపు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
అదిరిపోయిన 'ఫుడ్ బిజినెస్' - ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆసక్తి - Food Business Expo in vijayawada