GHMC To Conduct Field Survey In Greater Hyderabad : ఆస్తి పన్ను చెల్లింపుల్లో బల్దియాకు టోకరా ఇస్తున్న వారిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతుల కల్పన కోసం, నేటి నుంచి హైదరాబాద్‌లో ఇంటింటి సర్వేను చేయబోతుంది. నగరంలో ఆస్తి పన్ను పరిధిలో 19 లక్షల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా 1900 కోట్ల రూపాయల పన్నులు మాత్రమే వసూలవుతున్నాయి.
నగరంలో చాలా భవనాలు నివాసేతర వినియోగంలో ఉంటూ నివాస కేటగిరి పన్నులు చెల్లిస్తున్నాయి. ఐదంతస్తుల భవనంలో రెండు, మూడు అంతస్తులకే యజమానులు పన్నులు చెల్లిస్తున్నారు. కాయిలాపడ్డ పరిశ్రమలు, కూల్చివేసిన భవనాలు, కోట్లలో పన్ను బకాయిలున్న నిర్మాణాలు అనేకం ఉన్నాయి. వాటిని సరిదిద్ది పన్ను రాబడి పెంచేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను మొదలుపెట్టింది.
మొత్తం మూడు దశల్లో ఈ సర్వేను చేసి ఆస్తి పన్ను మదింపు చేయాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి దశలోని ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించింది. రెండో దశలో డ్రోన్ సర్వేను పూర్తి చేసింది. మూడో దశలో డ్రోన్ లో స్కానింగ్ చేసిన పటాలను ప్రత్యేక సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించనున్నారు. ఆ సర్వేను ఇవాళ్టి నుంచి నగరంలో జీహెచ్ఎంసీ మొదలుపెట్టనుంది.
"మొదట ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి,కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ఈ సర్వే జరగనుంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లోనూ వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం 400 మంది సర్వేయర్లు పనిచేయనున్నారు. సర్వే కోసం వచ్చే సిబ్బందికి యజమానులు, భవన నిర్మాణ అనుమతి వివరాలు, చివరి సారి చెల్లించిన ఆస్తిపన్ను రశీదు, నల్లా బిల్లు, విద్యుత్ బిల్లు, యజమాని ఐడీ వివరాలు, వాణిజ్య భవనాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది." - స్నేహ అంబరీశ్, జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్
ప్రజలకు మెరుగైన సేవలు, వనరుల నిర్వహణ కోసం ఈ సర్వే చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పట్టణ నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం తప్ప ఈ సర్వేను ఇతరత్ర అవసరాల కోసం వినియోగించబోమని స్పష్టం చేశారు. సర్వే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అన్ని ఆస్తులు, యుటిలిటీల వివరాలు ఖచ్చితంగా మ్యాపింగ్ చేయడం వల్ల భౌగోళికంగా గుర్తించడం సులభమవుతుందని, సమాచారం పారదర్శకంగా ఉంటుందన్నారు. ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ఇది ఉపకరిస్తుందని, ఆన్ లైన్ చెల్లింపులు మరింత సులభం అవుతాయని ఆమ్రపాలి పేర్కొన్నారు.
హై రెజల్యూషన్ మ్యాపింగ్ వల్ల రోడ్లు, పార్కులతోపాటు ఇతరాత్ర సదుపాయల వివరాలు స్పష్టంగా తెలుస్తాయని ఆమ్రపాలి తెలిపారు. జీఐఎస్ సర్వేతో లోపాలను గుర్తించి పన్ను మదింపు చేయడం వల్ల బల్దియాకు భారీగా ఆదాయం పెరుగుతుందని రెవెన్యూ విభాగం అంచనా వేస్తోంది. బడా నిర్మాణాలు ఎగ్గొడుతున్న పన్ను విలువే రాబడిలో 90 శాతం ఉంటుందని అంచనా. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాలుండగా ఈ సర్వేతో ఆ సంఖ్య 25 లక్షలు దాటుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. జీఐఎస్ ఇంటింటి సర్వేకు నగర పౌరులతోపాటు ఆయా డివిజన్ లోని కార్పొరేటర్లు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరుతోంది.