Ghee Making with Animal Wastage : బాగా ఆకలిగా ఉందని అప్పటికప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైనో, లేదా అపరిశుభ్రంగా ఉన్న హోటల్‌లోనో భోం చేస్తున్నారా? వేడివేడిగా ఉందని బిర్యానీ తింటున్నారా? ఏదో చిన్నపాటి దుకాణంలో స్వీట్లు కొని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం గుల్లయినట్టే! ఎందుకంటే ఆ ఆహార పదార్థాల్లో వాడిన నెయ్యి లేదా నూనె కుళ్లిన జంతు వ్యర్థాలతో తయారు చేసింది కావొచ్చు. ఇది ఊహించుకుంటేనే భయమేస్తోంది కదూ! మరి వాటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలోని అనేక అవయవాల పని తీరు దెబ్బ తింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెంగిచర్ల, అంబర్‌పేట, జియాగూడ, రామ్‌నాస్‌పురలో కబేళాల నుంచి జంతు వ్యర్థాలను నిబంధనల ప్రకారం చెంగిచర్లలోని రెండరింగ్ ప్లాంటుకు తరలించాలి. కానీ అలా జరగడం లేదు. ఈ వ్యర్థాలను కొందరు కొనుగోలు చేసి, రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున దందా చేస్తున్నారు. ఇంకొందరు జంతువులను విక్రయించే కేంద్రాల నుంచి నేరుగా సేకరించి నకిలీ నెయ్యి, నూనెలను ఉత్పత్తి కేంద్రాలకు తరలిస్తున్నారు. జంతు వ్యర్థాలను నెయ్యిగా మార్చే కేంద్రాలు రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 70 నుంచి 100 వరకు ఉన్నట్లు తెలిసింది.
కల్తీ వ్యవహారంపై ఈటీవీ భారత్ ఆరా : కొందరు జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంట నూనెలు తయారు చేస్తూ దానిని విక్రయిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రముఖ సంస్థలకు చెందిన నెయ్యి, వంట నూనెల్లో వీటిని కల్తీ చేసి, పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కొన్ని చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా జరుగుతోంది. ఈ వ్యవహారం పోలీసులకు, అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతూ చర్యలు తీసుకోకపోగా, కల్తీ నెయ్యి ఉత్పత్తి కేంద్రాలను 15 రోజులకోసారి మార్చివేయాలంటూ సలహాలిస్తున్నట్లు సమాచారం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కల్తీ వ్యవహారంపై ఈటీవీ భారత్ ఆరా తీయగా, అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నగరంలో ఈ వ్యవహారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. హైదరాబాద్‌లోని అలీనగర్, హాసన్‌నగర్, ప్రగతినగర్ కాలనీ వెనుక భాగంలో, శాస్త్రిపురం రైల్వేస్టేషన్ పొడవునా అనేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జల్‌పల్లితో పాటు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రాంతాల్లో నాలుగు, సంగారెడ్డి ప్రాంతాల్లో నాలుగు, పరిగి రోడ్డు కొందుర్గు శివార్లలో రెండు, కడ్తాల్, శివారు అటవీ ప్రాంతాల్లో రెండు, పటాన్‌చెరు మారుమూల ప్రాంతాల్లో నాలుగైదు చోట్ల కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కొండలు, గుట్టల మధ్య ఉంటాయి. నెలకోసారి వీటిని వేరేచోటకు మారుస్తుంటారు.
ముంబయి, పుణె, మరికొన్ని ప్రాంతాలకు రవాణా : జంతు వ్యర్థాల్లో గొడ్డు మాంసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యర్థాలను రెండు రోజుల పాటు అలాగే వదిలేస్తారు. దీంతో అవి కుళ్లిపోయి వాటిలో నుంచి పురుగులు పుట్టుకొస్తాయి. అలా కుళ్లిన వ్యర్థాలను 3-4 టన్నుల బాండీల్లో వేసి 2-3 రోజుల పాటు మరిగిస్తారు. దీనివల్ల వ్యర్థాల్లో ఉన్న ఎముకలు, ఇతర వ్యర్థాలు కరిగి పేస్టులాగా తయారవుతుంది. దీన్ని చల్లార్చి 20, 40 లీటర్ల డబ్బాల్లో పోస్తారు. ఈ డబ్బాలపై పేరొందిన కంపెనీల స్టిక్కర్లను అతికించి విక్రయించడానికి పంపిస్తారు. పాతబస్తీలో నుంచి డబ్బాలను, స్టిక్కర్లను సేకరిస్తారు. తయారీ కేంద్రాల్లో 20 లీటర్ల డబ్బా రూ.300కే విక్రయిస్తారు.
ఇక్కడి నుంచి రవాణా అయిన డబ్బాలు ముగ్గురు, నలుగురి చేతులు, కొంతమంది హోల్‌సేల్ వ్యాపారుల చేతుల్లోకి వెళుతున్నాయి. ప్రముఖ కంపెనీలు తయారు చేసిన నెయ్యి, నూనెల్లో కొందరు వ్యాపారులు ఈ నకిలీ నెయ్యి, నూనె కొంత కలుపుతున్నారు. కల్తీ చేసినట్లు అనుమానం రాకుండా వాటిలో రసాయనాలు కలుపుతున్నారు. కొంతమంది వీధి వ్యాపారులు సైతం వీటినే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా బిర్యానీ, వీధి వంటకాల్లో ఈ ‘నెయ్యి’నే ఉపయోగిస్తున్నారని సమాచారం. కల్తీ నెయ్యి ముంబయి, పుణె, మరికొన్ని ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో తయారీ కేంద్రంలో వారానికి 50 నుంచి 60 టన్నులు ఉత్పత్తి అవుతోంది.
కల్తీ నెయ్యి తయారీ కేంద్రంలో ఒక్కో కూలీకి రూ.1500 : నకిలీ నెయ్యి తయారీ గురించి పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల్లో నమోదుకు అప్పుడప్పుడు కొన్నిచోట్ల తనిఖీలు చేసి వదిలేస్తున్నారని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కొన్ని స్టేషన్ల నిర్వహణకు కొంత మొత్తాన్ని ఈ తయారీదారులే ఇస్తున్నారని తెలిసింది. ఒక్కో తయారీ కేంద్రంలో 15-25 మంది పని చేస్తున్నారు. వాటిలో 24 గంటలు పని చేసినందుకు ఒక్కో కూలీకి రూ.1,500 చొప్పున ఇస్తున్నారు.
'సాధారణ నూనెల్లా ఉండేందుకు కల్తీ నూనెల్లో రసాయనాలు కలుపుతారు. అందుకే అది త్వరగా జీర్ణం కావు. శరీరంలో విష పదార్థాలను వడపోసే కాలేయాన్ని సైతం ఈ రసాయనాలు దెబ్బతిస్తాయి. కిడ్నీల వైఫల్యానికి కూడా కారణమవుతాయి. నూనెలను పదే పదే వేడి చేసి వాడటం వల్ల ఉదరకోశ, పెద్దపేగు క్యాన్సర్లు సైతం వస్తాయి. ఈ నూనెలతో చేసిన పదార్థాలను తిని కల్తీ నూనెగా మనం గుర్తించలేం. వీటిని ల్యాబ్‌లో పరీక్షించాల్సిందే. అందుకే ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తినడమే మేలు'- డా.ప్రణీత్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, కేర్
కల్తీ నెయ్యి, నూనెలతో చేసిన వంటకాలను తింటే హృద్రోగ ముప్పు, పక్షవాతం లాంటి సమస్యలే కాకుండా ఉదరకోశ, పెద్దపేగు క్యాన్సర్లు వస్తుందని సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ ప్రణీత్ తెలిపారు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. టేప్ వర్మ్, సిస్టోసర్కోసిస్ పరాన్నజీవులు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిచేసినా చనిపోవు అని వివరించారు. అవి మన శరీరంలోని మెదడు, కాలేయం, పేగుల్లోకి చేరతాయని తెలిపారు. ఫలితంగా మూత్రపిండాలు, కాలేయం, ఇతర శరీర భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి ఆకస్మిక హృద్రోగ మరణాలకు కారణమవుతుందని వివరించారు. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడటం వల్ల బ్రెయిన్ హెమరేజ్‌కు కారణమవుతుందని, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు, మాట పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.