Ganja Seized In Warangal : ఉమ్మడి వరంగల్‌లో గతేడాది రూ.4.14 కోట్ల విలువైన 20 క్వింటాళ్ల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని 103 కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.4.12 కోట్ల విలువైన 13 క్వింటాళ్ల గంజాయిని పట్టుకుని 157 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్ జిల్లాల్లోనే కేసులు నమోదయ్యాయి.
ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో అమరిక : ఇటీవల మహబూబాబాద్ జిల్లా ముచ్చర్ల వద్ద రూ.47 లక్షల 76 వేల విలువైన 187 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. మరిపెడ మండలం గాలివారి గూడెం సమీపంలో రూ.31 లక్షల 75 వేల విలువైన 127 కేజీల ఎండుగంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల క్రితం హనుమకొండలో దాదాపు రూ.85 లక్షల విలువైన 338 కిలోల సరుకు పోలీసులకి చిక్కింది. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి రోడ్డు, రైలు మార్గంలో పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు విస్తృతం కావడంతో అక్రమార్కులు ఏదో రూపంలో యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకి కొనుగోలు చేసి అనామకులతో రవాణా చేయిస్తూ బడా స్మగ్మర్లు కాసులు గడిస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే అనామకులే బలవుతున్నారు తప్ప పెద్దవారు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.
పోలీసుల గస్తీ : గంజాయికి అలవాటుపడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు యువకులు గంజాయికి బానిసై నేరాలకూ అలవాటు పడి జైలు పాలయ్యారని గుర్తుచేశారు. గంజాయి అక్రమ రవాణాదారులకు అడ్డుకట్ట వేయడంతోపాటు వ్యసనంతో అనారోగ్యం పాలైన వారిని దృష్టి మరల్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న సరుకు విలువ దాదాపు రూ.37 లక్షలు వరకి ఉంటుందని తెలిపారు. కారును సీజ్‌చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
"ఎవరికైనా గంజాయి సరఫరా వాడుతున్నవారి గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలపండి. గంజాయి సరఫరా చేస్తున్నవారికోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఇచ్చే సమాచారంతో ఎక్కువ మందిని పట్టుకునే అవకాశం ఉంటుంది. గంజాయికి అలవాటు పడ్డవారికి మానిపించడానికి డీ అడిక్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. వారిని పట్టుకోవడమే కాకుండా మాన్పించేలా కూడా చర్యలు తీసుకుంటున్నాం." - అంబర్ కిషోర్ ఝా, వరంగల్ పోలీస్ కమిషనర్
భద్రాద్రి కొత్తగూడెంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్ - రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం