Ganja Seller Arrested in Hyderabad : రాష్ట్రంలో గంజాయి క్రయవిక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులు వివిధ మార్గాల ద్వారా మత్తు పదార్థాలను హైదరాబాద్‌కు చేరుస్తూ, తరచుగా పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా మరింత ఎక్కువైంది. నగరంలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో గంజాయి డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఒడిశాకు చెందిన ఓ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
వినియోగదారుడి నుంచి సరఫరాదారుడిగా : ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్న రాహుల్ బైద్యా అనే నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైలులో గంజాయిని తీసుకొచ్చి, లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న రాహుల్‌ను మాటు వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు, అతడి నుంచి 10 కిలోల గంజాయి, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన రాహుల్ గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని పోలీసులు వెల్లడించారు. క్రమంగా వినియోగదారుడి నుంచి సరఫరాదారుడిగా మారాడని వివరించారు.
నానక్‌రామ్‌గూడ అడ్డాగా నీతూబాయి గాంజా దందా - పోలీస్ డెకాయ్ ఆపరేషన్‌లో బహిర్గతం
మాటు వేసి : ఒడిశాకు చెందిన జగన్నాథ్ బిస్వాస్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని విక్రమ్ అలియాస్ వివేక్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. జగన్నాథ్ వద్ద కిలో రూ.5 వేలకు కొంటున్న రాహుల్, హైదరాబాద్‌లో రూ.15 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన రాహుల్‌ను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు అప్పటికే అక్కడ మాటు వేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్‌కు గంజాయి సరఫరా చేస్తున్న జగన్నాథ్, రాహుల్ నుంచి కొనుగోలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వివేక్‌లు పరారీలో ఉన్నట్లు వివరించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి
కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు - ముఠాల ఆట కట్టించిన పోలీసులు