Gang Rape On Pharmacy student : వరంగల్లో ఓ యువతిపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఆ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగర శివారులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని వసతి గృహంలో ఉంటోంది. గత నెల 15న యువతికి పరిచయం ఉన్న యువకుడు మాట్లాడాలని కారులో ఎక్కించుకున్నాడు.
అప్పటికే అందులో ఉన్న మరో ఇద్దరు యువకులు ఉన్నారని తాను రానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడు. వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జి మొదటి అంతస్తులో గది తీసుకున్నారు. అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
కుటుంబ సభ్యులకు విషయం చెప్పిన బాధితురాలు : ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంటికెళ్లిన బాధితురాలు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పింది. మంగళవారం తల్లితో కలిసి వరంగల్ పోలీసు కమిషనర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కమిషనర్ సూచనల మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతెజార్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలను అనుసరించి ఆమెను నిర్బంధించిన కూరగాయల మార్కెట్ సమీపంలోని లాడ్జిలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ ప్రధాన నిందితుడు ఇచ్చిన ఆధార్ కార్డ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
మరో నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులు : ఆధార్ సాయంతో బాధితురాలి మిత్రుడితో పాటు ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిది భూపాలపల్లిగా గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడో నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బాధితురాలని వైద్యసాయం నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇంతెజార్ గంజ్ పీఎస్ సీఐ శివకుమార్ తెలిపారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సూచించారు.