Ganesh Mandapam Decoration with Currency Notes in AP : వినాయక చవితి అంటేనే చిన్నా, పెద్దా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ కోసం వినాయక విగ్రహాలను ఏరికోరి తీసుకువస్తుంటారు. చాలామంది వినూత్నమైన విగ్రహాలను పెడతారు. అలాగే 9 రోజుల పాటు వివిధ రకమైన కార్యక్రమాలతో పూజలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతిరోజు కొత్తకొత్తగా మండపాలను తీర్చిదిద్దుతుంటారు. తమ మండపం వినూత్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు.
ఇందులో భాగంగానే ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరిలో వస్త్ర వ్యాపారులు వినూత్నంగా చేయాలని భావించారు. ఏకంగా ఇందుకోసం రూ.2.3 కోట్ల విలువైన నోట్లతో దండలు చేశారు. ఒకప్పుడు గణపతికి పూజ చేయాలంటే వివిధ రకాల పుష్పాలను సేకరించి వాటిని దండలుగా చేసి కట్టేవారు. కానీ ప్రస్తుతం స్వామివారికి పుష్పాల స్థానంలో కరెన్సీ నోట్లను దండలుగా రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సంకా బాలాజీ గుప్తా బ్రదర్స్, ఆర్యవైశ్య సంఘ సంయుక్తంగా భక్తుల నుంచి సేకరించిన రూ.2.30 కోట్ల విలువైన నోట్లను దండలు కట్టి ఈనెల 13న వీధిలో ఏర్పాటు చేసిన 21 అడుగుల గణపతి విగ్రహానికి అలంకరించనున్నారు.
ఈ దండల కోసం రూ.10నోటు నుంచి రూ.500 నోటు వరకు సేకరించారు. వాటిని దండలుగా కూర్చి స్వామి వారికి అలంకరించనున్నారు. ఈ ఆదివారం నిమజ్జనం నిర్వహించనుండగా, శుక్రవారం భారీ ఎత్తున పూజ కోసం కరెన్సీ నోట్లతో దండలు ఏర్పాటు చేస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా స్వామివారికి ఇలా నోట్లతో అలంకరిస్తున్నట్లు వ్యాపార వేత్త బాలాజీ గుప్తా తెలిపారు.
వాటర్ ట్యాంక్ కింద మహా గణపతి - సోషల్ మీడియాలో వైరల్ అయింది - Ganesha Mandapam on Water Tank
వినాయక నిమజ్జనాల కోలాహలం: మరోవైపు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాల కోలాహలం మొదలైంది. మూడు రోజులపాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వినాయక ప్రతిమలను ట్రాక్టర్లపై ఊరేగించారు. వాహనాలను అందంగా అలంకరించి, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ప్రధాన కూడళ్లలో స్వామివారిని విహరింపజేశారు. వైఎస్సార్ జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకగా సాగింది.
కడప నగరంలోని వందల విగ్రహాలను దేవునికడప చెరువులో నిమజ్జనం చేశారు. క్రేన్ల సాయంతో విగ్రహాలను చెరువులోకి దింపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గణేష్ నిమజ్జన శోభతో హోరెత్తింది. ఎర్రగూడూరు సమీపంలోని తెలుగుగంగ వద్ద చేసిన నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా పరిశీలించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వినాయక నిమజ్జనంలో రెండు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. వాకాడు మండలం తూపిలి పాలెంలో సముద్రం తీరంలో ముగ్గురు యువకులు గల్లంతు కాగా ఇద్దరిని పోలీసులు కాపాడారు. మరో యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. నిమజ్జనానికి వెళ్తూ ఓ యువకుడు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన ఘటన కావలిలో జరిగింది.
గణపయ్యకు ఒకేసారి 42వేల మంది మహిళల హారతి- గిన్నిస్ రికార్డు దాసోహం - Devotees Harathi