Free Skill Training In Solar Installation : భవిష్యత్‌లో ప్రపంచమంతా హరిత ఇంధనం వైపు పరుగులు తీస్తోంది. ఈ రంగంలో భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు దేశంలో నైపుణ్యాలు లేని కారణంగా నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారు. ఈ రెండింటిని సమతుల్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు యువతకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
నిరుద్యోగ యువతకు రెడ్డీస్ ల్యాబ్ ఉచిత శిక్షణ : గ్రీన్ ఎనర్జీ రంగంలోని ఉపాధి అవకాశాలను గ్రామీణ యువతీ యువకులకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందుకు వచ్చింది. కరీంనగర్ వేదికగా యువతకు సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్, సమస్య పరిష్కారాలపై ఉచిత శిక్షణ ఇస్తోంది. 18 నుంచి 28ఏళ్ల లోపు ఉండి ఉద్యోగం రాక సతమతమవుతోన్న వారికి 3 నెలలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. రెండు నెలలు థియరీ, నెలరోజులు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది రెడ్డీస్ ల్యాబ్ ఫౌండేషన్. ఇప్పటికే శిక్షణ తీసుకున్న వారిలో 75% మంది ఉద్యోగం పొందారు. దాంతో ఈ శిక్షణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతీ యువకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సమాచారం తెలుసుకుని ఆసక్తితో చేరినట్లు శిక్షణలో ఉన్న యువత చెబుతున్నారు .
సోలార్ ఫ్యానల్ ఇన్‌స్టాలేషన్ : సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్ శిక్షణలో భాగంగా సౌర విద్యుత్‌ను ఎలా తయారు చేస్తారు? ఎలా ఏర్పాటు చెయ్యాలి? వీటి సూత్రాలు ఏమిటి? అన్నవాటిపై నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. సాంకేతిక వివరాలు బోధిస్తున్నారు. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంటర్వ్యూలకు ఎలా హాజరు కావాలనే అంశాలపై మెలకువలు చెబుతున్నారు. ఇవి తమ భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగ పడుతాయని విద్యార్థులు చెబుతున్నారు.
"నేను ఇంటర్ పూర్తి చేశాను. మా ఫ్రెండ్ సలహా మేరకు రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాను. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లో మెళకువలు నేర్చుకుంటున్నాను. శిక్షణలో భాగంగా సాఫ్ట్ స్కిల్స్, ఇన్‌స్టాలేషన్‌లో పలు అంశాలు నేర్పిస్తున్నాను. ఈ ట్రైనింగ్ మాలాంటి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగం పొందేందుకు శిక్షణ ఎంతగానో తోడ్పతుంది"- రవళి, శిక్షణ పొందుతున్న విద్యార్థిని
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకువిధంగా : గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే సదుద్దేశంలో భాగంగా సోలార్, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కోటి కుటుంబాలకు సబ్సిడీపై సోలార్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే సోలార్ రంగంపై దృష్టి సారించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఆసక్తి గల వారికి శిక్షణ ఇస్తోంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గ్రామీణ యువత నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 3 నెలల కోచింగ్‌లో ప్రతిభను మెరుగు పరుచుకుని ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ సదావకాశంతో భవిష్యత్తులో తమ కుటుంబాలకు అండగా నిలుస్తామని ధీమాగా చెబుతున్నారు.