Free Gas Cylinder Booking in AP From October 29th : ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ పథకం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనెల 29వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
పట్టణాల్లో 24 గంటల్లోనే సరఫరా : సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుందని నాదెండ్ల వెల్లడించారు. 24 నుంచి 48 గంటల్లో సిలిండర్‌ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పాయని, పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే సరఫరా చేస్తామని చెప్పాయని తెలిపారు. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తామన్న నాదెండ్ల, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 29వ తేదీన ఆయిల్ కంపెనీలకు చెక్కు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Free Gas Eligibility : ఇందుకు సంబంధించిన అర్హతలను సైతం ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, క్యాండిడేట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. వారికి ప్రభుత్వం అందజేసే మూడు ఫ్రీ సిలిండర్లలో ఫస్ట్ సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా : ఈ నెల 30న ఏపీ సీఎం చంద్రబాబు చేతుల చేతుల మీదుగా తొలి సిలిండర్ ఇప్పిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకవేళ పథకం ఎవరికైనా అందకపోతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చని పేర్కొన్నారు. కాగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపావళి కానుకగా ప్రజలకు అందించేందుకు సమాయాత్తమవుతోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సర్కారు సమాయాత్తమవుతోంది.
"1.55 కోట్ల కనెక్షన్లకు ఉచితంగా 3 గ్యాస్‌సిలిండర్లను పంపిణీ చేస్తున్నాం. ఈరోజే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తాం. ఈనెల 29నే గ్యాస్‌బుక్‌చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌కు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండాలి"- నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి
గుడ్ న్యూస్ - దీపావళి నుంచి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు
ఏపీ ప్రజలకు దీపావళి కానుక - ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముందే బుకింగ్స్