Fraud at Anganwadi Centre in Telangana : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. బలహీనత, రక్తహీనతను అధిగమించేందుకు అనేక పథకాలను అమలు చేస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు మేలు చేకూరుస్తున్నారు. కానీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవి నామమాత్రమే అందుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కేంద్రాల్లోనే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక భోజనం అందించాలి. కానీ జిల్లాలో చాలా కేంద్రాల్లో వంట చేయకుండా సరకులను పంపిణీ చేస్తున్నారు.
ప్రైమరీ స్కూల్ చిన్నారులకు కేంద్రాల్లో భోజనం పెడుతున్నా ఎక్కడా దానికి సంబంధించిన మెనూ(Menu) పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకున్నా రిజిస్టర్లలో మాత్రం పూర్తి స్థాయిలో వస్తున్నట్లు పక్కాగా హాజరు నమోదు చేస్తున్నారు. కానీ దీన్ని పరిశీలిస్తే లెక్క తప్పుతోంది. పలు కేంద్రాల్లో ఇలా హాజరు నమోదు చేసి పౌష్టికాహారం సరకులు, నూనె, పాల ప్యాకెట్లు, పప్పులు, గుడ్లు వంటివి మాయం చేస్తున్నట్లు సమాచారం. దీనికి పర్యవేక్షకుల ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యమే కారణమని తెలుసుకున్న జిల్లా పాలనాధికారి ఆశిశ్ సంగ్వాన్ ఇటీవల ఐసీడీఎస్(ICDS) అధికారులు, సిబ్బందిని ప్రత్యేక సమావేశంలో హెచ్చరించినా మార్పు లేకపోవడం గమనార్హం.
భైంసా పట్టణంతో పాటు తానూరు, కుభీరు, కుంటాల, ముథోల్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో మరింత అధ్వానంగా ఉందని పలువురు తెలుపుతున్నారు. భైంసాలోని బిజ్జూరు అంగన్‌వాడీ కేంద్రంలో ఎనిమిది మంది బాలింతలు, ముగ్గురు గర్భిణులు, సాధారణ చిన్నారులు 17 మంది, 24 మంది ప్రి స్కూల్ చిన్నారులు నమోదై ఉన్నారు. కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య సగమే. అయినప్పటికీ అనుమానం రాకుండా ఒకరిద్దరిని గైర్హాజరుగా చూపుతూ, మిగతావాళ్ల హాజరు నమోదు చేసి సరకులు మాయం చేస్తున్నట్లు సమాచారం.
Anganwadi Centre Cheating on Nutritious Food : భైంసా మండలం లింగా-1 అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో లింగా-2 గ్రామంలోనూ పౌష్టికాహారం అందించాలి. కానీ ఎప్పుడు అందిస్తారో తెలియదని లింగా-2 గామస్థులు తెలిపారు. మరోవైపు ఇక్కడి కేంద్రంలో 12 మందికి పైగా చిన్నారులు, ముగ్గురు గర్భిణులు, ఇద్దరు బాలింతలు నమోదై ఉన్నారు. కానీ ఎప్పుడు చిన్నారులు కేంద్రాలకు రారని తెలుస్తోంది. నిర్వాహకులు రికార్డుల్లో లెక్కలు పక్కాగా నమోదు చేస్తూ సరకులను మాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కామోల్‌లో కూడా నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గదులు లేక పాత ప్రాథమిక పాఠశాల భవనంలోనే కొనసాగిస్తున్నారు. ఒకటి, మూడవ కేంద్రాలు ఒక గదిలో, 2, 4వ కేంద్రాలు మరో గదిలో ఉన్నాయి. 1వ కేంద్రంలో 14 మంది, 3వ కేంద్రంలో పదిహేను మంది, రెండో కేంద్రంలో ఇరవై, నాలుగో కేంద్రంలో 12 మంది చిన్నారులు హాజరుపట్టికలో నమోదై ఉన్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు సమన్వయంతో ఉంటూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో హాజరు నమోదు లెక్క వేస్తున్నా నాలుగు కేంద్రాల్లో కలిసి 10 మందికిపైగా కనిపించక పోవడం గమనార్హం.
'డ్యులింగో పరీక్ష'లో మాస్ కాపీయింగ్ - ప్రశ్న ఒకరికి - ఆన్సర్ మరొకరిది