Four Died in Road Accident Across Telangana : ఈరోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు. రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాలు తీరని శోకసంద్రంలో మునిగిపోయాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్- కమలాపూర్ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆదివారం రాత్రి అతివేగంగా వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు.
కమలాపూర్ గ్రామానికి చెందిన యువకులు రేగళ్ల నరేశ్(30), రేగళ్ల ప్రమోద్(25), రేగల్లా సిద్దూ కలిసి ద్విచక్రవాహనంపై రాంపూర్ గ్రామం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు వారి ద్విచక్రవాహన్నాన్ని ఢీకొట్టింది. దీంతో నరేశ్ అక్కడిక్కడే మృతి చెందగా ప్రమోద్ను చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మరో యువకుడు రేగళ్ల సిద్దూకు గాయాలవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మృత్యుపాశంగా మారిన రోడ్డు ప్రమాదాలు : ప్రమాదానికి గురైన కారులో మద్యం సీసాలు ఉన్నాయన్న స్థానికులు, అందులో ఉన్నవారిని మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. కారుపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో స్టికర్ ఉన్నట్లు తెలిపారు. పార్టీ చేసుకొని తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు యువకుల మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కవిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు అక్కన్నపేట మండలంలోని పంతులు తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు, గ్రామస్థులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డీఎం ఘటన స్థలానికి రావాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ అరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గుర్తుతెలియని వాహనాన్ని బైక్‌ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
వనపర్తిలో రోడ్డు ప్రమాదం - గుజరాత్‌కు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి