Road Accident in AP : తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఏపీకి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి-నార్కట్పల్లి హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం సమీపంలో గీతికా స్కూల్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
మృతుల వివరాలు : మృతులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, యోగులు, వెంకటేశ్వర్లు, వనితగా పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త కారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.
శనివారం ఐదుగురు యువకులు మృతి : ఈ నెల 7వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు. కారు చెరువులో మునగడంతో హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్ అనే ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆసుపత్రి ప్రాంగణం కన్నీటి పర్యాంతమయింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా, మణికంఠ అనే యువకుడు చెరువులో కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. వీరంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువకులు కావడం విశేషం.
యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు - ఐదుగురు యువకుల జల సమాధి
మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? - డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని తెలుసా