SVSN Varma Fires on Vanga Geetha: కాకినాడ ఈఎస్‌ఐసీ (Employees State Insurance Corporation) ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారని ఈఎస్‌ఐ డైరెక్టర్‌ను ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, 25 నుంచి 30 మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు.
ఈ అవినీతిలో ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు వాటా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తరఫున విచారణ కోరతామన్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈఎస్‌ఐ ఉద్యోగాలు సమానంగా భర్తీ చేయాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పిఠాపురంలో ఓటమి భయంతో వంగా గీత సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నారని వర్మ విమర్శించారు. 10 లక్షల రూపాయల చొప్పున పిఠాపురం మున్సిపాలిటీలో కూడా ఉద్యోగాలు అమ్మేశారని ఆరోపించారు.
ఎంపీ వంగా గీత వచ్చిన వెనక్కి తగ్గని మత్స్యకారులు- న్యాయం కోసమేనంటూ ఆందోళనలు
కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గెలుపును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రౌడీషీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి గొడవలకు దిగేందుకు కుట్ర చేస్తున్నారని వర్మ తెలిపారు. రౌడీషీటర్లు, పోలీసు కేసులున్న వారికి ఏజెంట్లుగా అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను (Returning Officer) కోరతామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా స్వతంత్ర అభ్యర్థుల తరఫున కూడా వైఎస్సార్సీపీ నేతలే అనుమతి పొందుతున్నారని, వారిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు.