Food wastage In India : కూడు, గూడు, గుడ్డ మనిషి జీవనానికి కనీస అవసరాలు. ముఖ్యంగా కూడు ఉంటేనే గూడు గుడ్డను సంపాదించుకోగలం. మరోలా చెప్పాలంటే కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. ప్రపంచంలోని ప్రతీ జీవి ఆహారం కోసమే నిత్యం శ్రమిస్తుంది. కానీ, కనీసం ఆహారం దొరక్కా కోట్లాదిమంది అలమటిస్తుంటే మరోవైపు కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్న దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆహార సూచీ-2024 నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ఆహార వృథా సూచీ దీనికి సంబంధించి అనేక గణాంకాలతో నివేదిక విడుదల చేసింది.
UN Report On Food Wastage : ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తైన ఆహారంలో 19% వృథా అయినట్లు నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2019లో 17% ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి 2% పెరిగి 19శాతాని కి చేరినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60% గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28% ఉన్నట్లు తేలింది. మిగిలిన 12% ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తెలిసింది. ఆహార వృథాను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటూ అనేక దేశాలు గొప్పలు చెబుతున్న వేళ తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.
Causes Of Food Wastage : ఆహార వృథాకు ప్రజల సామాజిక అలవాట్లు కూడా కారణం అనే వాదన ఉంది. వివాహాలు, ఇతర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే విందు భోజనాల ఏర్పాట్లలో తీవ్ర ఆహార వృథా జరుగుతోంది. వేడుకలు ఎలా నిర్వహించుకోవాలి అన్నది వ్యక్తిగత విషయమే ఐనా ఈ సందర్భంగా జరుగుతున్న వృథాయే కలవరపెడుతోంది. విందు సందర్భంగా హోదాను చాటుకునేందుకు లెక్కలేనన్ని పదార్థాలను వండి వడ్డించడం, అన్ని పదార్థాలను తినలేక అతిథులు అలాగే వదిలేస్తున్న ఉదాహరణలు లెక్కకు మిక్కిలి. అతిథులు తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు చెత్త కుండీల పాలవుతోంది. అలా మిగిలిన ఆహార పదార్థాలను కొందరు పేదలు, స్వచ్ఛంద సంస్థలు, ఫుడ్ బ్యాంకులకు అందిస్తున్నా ఎక్కువ శాతం వృథాగానే పోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాగే జరుగుతోంది.
ఆహార నష్టమూ అధికమే: ఆహార వృథా పరిస్థితి ఇలా ఉంటే ఆహార నష్టం కూడా అధికంగానే ఉంది. పంట కోతల తర్వాత, చిల్లర విపణి స్థాయిలో ఆహారం వినియోగానికి పనికి రాకుండా పోవడాన్ని ఆహార నష్టంగా అభివర్ణిస్తారు. కాగా ఆహార వృథాను వృథాగానే చూడకుండా దానికి ఓ రైతు పడే కష్టాన్ని లెక్కగడితే దాని విలువను తెలుసుకోవచ్చు. దుక్కి దున్ని, నీరు పెట్టి, నారు పోసి ఆరుగాలం శ్రమించే అన్నదాత కష్టానికి ఫలితమే ఆహార లభ్యత. కానీ, ఆ ఆహార ధాన్యాలు పంటపొలం నుంచి మార్కెట్‌లోకి వచ్చే క్రమంలోనూ అధికంగా నష్టం జరుగుతోంది.
వృథా అవుతున్న రైతుల కష్టం : లక్షల టన్నుల మేర ఆహారం వృథా కావడం వల్ల ఆ మేరకు పంటలు పండించడానికి ఉపయోగించిన నీరు, పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, రైతుల కష్టం వృథా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహార పదార్థాలు సుమారు 30% సాగు భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో సమానమని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఆహార వృథాను లెక్కించడానికి ట్రాకింగ్ వ్యవస్థలు సరిగ్గా లేవు. ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, సౌదీ అరేబియాలు ఇందుకు సరైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.
ఆహార సరఫరాలో వృథా వల్ల భారత్‌లో లక్ష కోట్ల నష్టం : ఆహార సరఫరాలో నష్టాలు, వృథా వల్ల ప్రపంచానికి సుమారు 83 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు ఐరాస నివేదించింది. భారత్‌లో ఈ నష్టం దాదాపు లక్ష కోట్ల రూపాయలని అంచనా. ఆహార వృథా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. ఆహార వ్యర్థాలను డంపింగ్ యార్డులు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. అవి కుళ్ళిపోయే క్రమంలో ప్రమాదకర మైన ఉద్గారాలు వాతావరణంలోకి వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలవు తున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో 10% వరకు కుళ్ళిన ఆహారం నుంచే వస్తున్నట్లు అంచనా.
తీవ్రమైన అకలి సమస్యను ఎదుర్కొంటున్న 78.3 కోట్లమంది : ఆహార వృథా పరిస్థితి ఇలా ఉంటే నేటికీ కనీసం తీనేందుకు బుక్కెడు అన్నం లేక కోట్లాది మంది అలమటిస్తున్నారు. రోజంతా పస్తులుండే వారు కొందరైతే ఒక పూట తిని ఒక పూట తినలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 78.3కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆకలి బాధను అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార వృథాకు సంబంధించి వెలువరించిన గణాంకాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఆకలి కేకల గురించి గతేడాది ఐక్యరాజ్యసమితి ఇంత కంటే ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది.
2022లో 240కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు తెలిపింది. 78.3కోట్ల మంది ఆకలితో అలమటించగా, 14.8కోట్ల మంది పిల్లల్లో ఎదుగుదల లోపించినట్లు ఆహార భద్రత పరిస్థితి-పోషహాకారం పేరుతో విడుదల చేసిన ఆ నివేదిక వెల్లడించింది. తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 25% ఇండియాలోనే ఉన్నారన్నది కఠిన వాస్తవం. నూటపాతిక దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచీ-2023లో భారత్ 111వ స్థానంలో నిలవడం దేశంలో నెలకొన్న క్షుద్బాధకు అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే దేశ జనాభాలో 14.5% మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ ఇదివరకే హెచ్చరించింది.
ప్రపంచానికే ఆకలి తీరుస్తున్న భారత్ : ప్రపంచంలో అత్యధికంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం ఇండియాదే. నిరుడు భారత్‌లో సుమారు 33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. పాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పండ్లు, కూరగాయలు, టీ, చెరకు, గోధుమ, వరి సాగు, చేపల పెంపకంలో రెండో స్థానంలో ఉంది. 4లక్షల కోట్ల రూపాయల విలువైన ఆహారోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
దేశ అవసరాలనే తీర్చడంలో విఫలం అవుతున్న పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేయడం సరైన పద్దతి కాగని నిపుణులు చెబుతున్నారు. దేశీయ ఆహార అవసరాలను గుర్తించి ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఆకలితో అలమటిస్తున్న వారికి ఆదుకోవడం తో పాటు ఆహార సూచిలోనూ మెరుగైన సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పంటల సాగుపై వాతావరణ మార్పుల ప్రభావం : ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న వాతావరణ మార్పులు, జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా సాగు తగ్గిపోతుంది. పంటలపై పడుతున్న ప్రతికూల ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆహార వృథాను అరికడితే ఎంతో మంది ఆకలిని తీర్చవచ్చు. పోషకాహారలేమిని నివారించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలూ బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. అవసరమైనంతే వండుకోవాలి. పండ్లు, కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయడంపై దృష్టి సారించాలి. ఆహార పదార్థాలను వృథా చేయకూడదని పిల్లలకు నేర్పించాలి. వీటితో పాటు ఆహార పదార్థాల సరఫరా, నిల్వ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఆహార వృథాను తగ్గంచడం పెద్ద కష్టమేమి కాదు.