Flood Effect In Khammam : వరదలతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటి ప్రభావం ఆటోమొబైల్ రంగంపై కూడా పడింది. ఖమ్మం నగరంలోని మున్నేరు నదికి రెండువైపులా ఎటు చూసినా వాహనాల ఇంజిన్ల భాగాలు విడదీసి శుభ్రం చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొందరు వాహనాల లోపలికి చేరుకున్న బురదను తొలగిస్తుండగా మరికొందరు మెకానిక్‌లను తీసుకొచ్చి నీరు చేరి పాడైన డీజిల్ ట్యాంకులు, ఇంజిన్‌లను మరమ్మతు చేయిస్తున్నారు. ఖమ్మం నగరం వెంట ప్రవహిస్తున్న మున్నేరు నదికి రెండువైపులా 10 కి.మీ మేర ఆటోమొబైల్ రంగం విస్తరించి ఉంది.
ఉపాధిపై వరద ఉప్పెన : వందాలాది మంది మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసి లైటింగ్, వైరింగ్, అలైన్మెంట్, బాడీ బిల్డింగ్ లాంటి పనులు చేస్తుంటారు. ఆదివారం సెలవుదినం కావడంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిపి ఉంచారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదతో షెడ్లలోని కార్లు, భారీ సంఖ్యలో బైక్‌లు, లారీలు, కార్ల ఇంజిన్లు, ఆయిల్ ట్యాంక్‌లలోకి నీరు చేరింది. ఒక్కో లారీకి సుమారు రూ.50 వేల వరకు నష్టం కలిగిందని వాటి యజమానులు, డ్రైవర్లు వాపోతున్నారు. ఖరీదైన కార్లకు రూ.లక్ష వరకు నష్టం వచ్చినట్లు సమాచారం. ఆటోమొబైల్ దుకాణాల్లో విడిగా విక్రయించే ఆయిల్స్ డ్రమ్ముల్లోకి బురద చేరి పనికిరాకుండా పోయింది.
మరమ్మతులకు ఇచ్చిన వాహనాలు కొట్టుకుపోవడంతో : విడిభాగాలు కొన్ని దెబ్బతినగా మరికొన్ని వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఒక్కో దుకాణానికి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతులకు ఇచ్చిన వాహనాలు కొట్టుకుపోవడంతో వాటి యజమానులు తమపై ఒత్తిడి తెస్తున్నారని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, చెడిపోయిన వాహనాల మరమ్మతులు చేసేందుకు రూ.వేలల్లో వ్యయం అవుతుండటంతో వాహనదారులు జేబులు తడుముకుంటున్నారు.
సేద తీరుతామని నిలిపితే : రవాణాకు సంబంధించిన వాహనాలను కాల్వ ఒడ్డున నిలిపిఉంచి డ్రైవర్లు సేదతీరుతుంటారు. ఇక్కడ ఎఫ్‌సీఐ గోదాములు ఉండటంతో ఎక్కువగా లారీలు వస్తుంటాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు కూరగాయలు, ఇతర సామగ్రి రవాణా చేసే లారీలనూ ఇక్కడ నిలుపుతుంటారు. ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిపిఉంచారు. వరదనీరు వచ్చినా టైర్ల స్థాయిలోనే నిలిచిపోతుందని అంతా భావించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో లారీలు మునిగే స్థాయిలో నీరు రాగా, మరికొన్ని చోట్ల ఇంజిన్లను ముంచింది.
ఎవరి నోట విన్నా అదే వ్యథ : వరదల కారణంగా మరమ్మతులకు గురైన కారు ఇంజిన్‌ను బాగు చేస్తున్న ఈయన పేరు చారి. వృత్తి రీత్యా ఈయన మెకానిక్‌గా పనిచేస్తుంటారు. అకస్మాత్తుగా వచ్చిన వరద షెడ్‌ను బురదమయంగా మార్చేయడంతో రూ.లక్షల విలువైన పరికరాలు పనికిరాకుండా పోయాయని, చాలా వస్తువులు కనిపించడం లేదని, నిలిపి ఉంచిన కార్ల అంతర్గత భాగాల్లోకి వరదనీరు చేరడంతో ఇంజిన్లు పాడయ్యాయని వాపోయారు. చేతిపనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్న వారిపై వరద ఎంత తీవ్ర ప్రభావం చూపిందో చెప్పే ఉదంతమిది. వరద వల్ల ఇబ్బందులకు గురైన బాధితులు ఖమ్మంలో వందల సంఖ్యలోనే ఉన్నారు.
మూడు కార్లు కొట్టుకుపోయాయి : 'వరద ప్రవాహానికి కారు మరమ్మతుల షెడ్ కుప్పకూలిపోయింది. చిన్న చిన్న రిపేర్లకు వచ్చిన కార్లలో మూడు కొట్టుకుపోయాయి. వస్తువుల్లో ఏమీ మిగల్లేదు అన్నీ వరదనీటిలో పోయాయి' కార్ల షెడ్ యజమాని బ్రహ్మం తెలిపారు.
"ఇరవై ఏళ్లుగా లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. శనివారం రాత్రి లారీని నిలిపి ఇంటికి వెళ్లా. ఆదివారం భారీ వరద లారీని ముంచింది. ఇంజిన్, డీజిల్, ఇతర ఛాంబర్లలోకి నీరు చేరింది. రూ.50 వేల నష్టం వాటిల్లింది. పరిసరాల్లోనే ఉన్న నా ఇల్లు కూడా మునిగిపోయింది"- సుధాకర్, కాల్వొడ్డు, లారీ డ్రైవర్-యజమాని
ద్విచక్ర వాహనాల ఇంజిన్లు చెడిపోయాయి : 'దుకాణంలో ఉంచిన కొన్ని ద్విచక్ర వాహనాల ఇంజిన్లలోకి నీరు చేరింది. రూ.వేలల్లో నష్టం కలిగింది. ఇతర పరికరాలన్నీ పనికిరాకుండా మారాయి. ప్రభుత్వం ఆదుకోవాలి' అని బాధితులు కోరుతున్నారు.
వరదలతో బైక్‌లు దెబ్బతిన్నాయా? - ఇలా చేస్తే తక్కువ ఖర్చుతో బయటపడొచ్చు! - Tips for Flooded Bike Repair
నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024