Flood Victims are Worried at Munneru Bridge : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 అడుగుల మేర ఖమ్మం వద్ద ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వాగు నేడు కాస్త శాంతించింది. దీంతో బాధితులు మున్నేరు వంతెన వద్ద ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన చెందారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా మున్నేరులో వరద రావడంతో ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, పోలేపల్లి, గొల్లపాడు, తీర్థాల, పెద్ద తండాలలో ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి ఆందోళనలతో మున్నేరు వంతెన నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. ఇప్పటికైనా స్థానిక మంత్రులు స్పందించి వెంటనే తమకు సహాయక చర్యలు అందించాలని బాధితులు కోరుతున్నారు.
తేరుకుంటున్న మున్నేరు వాగు పరీవాహక ప్రాంతాలు : మున్నేరు వాగు పరివాహక ప్రాంత ప్రజలకు కాస్త ఊరట నిచ్చే అంశం. మున్నేరు ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువన జిల్లాలో వర్షాలు లేకపోవడంతో మున్నేరుకు వరద తగ్గింది. వరద సమయంలో 36 అడుగుల ఎత్తులో ప్రవహించిన మున్నేరు నది ప్రస్తుతం 15 అడుగుల మేర తగ్గి నీటిమట్టం ఉంది. దీంతో మున్నేరు ప్రాంతాలు క్రమంగా తేరుకుంటున్నాయి.
బియ్యం వరదలో కొట్టుకుపోయాయి : ఖమ్మం నగరానికి అనుకొని ప్రవహిస్తున్న మున్నేరు నది ఆదివారం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో కాలనీ వాసులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, నిత్యావసరాలు వరదకు కొట్టుకుపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. మొత్తం తడిసి ముద్దయిందని, ఎందుకు పనికి రాకుండా పోయాయని, దీనికి తోడు బురద నివాసాల్లో పేరుకుపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం నుంచి ఆహారం లేక నిరసించిన ప్రజలు వరద నీటితోనే ఇంటిని కడుగుతున్నారు. చిన్నారుల పుస్తకాలు తడిసిపోయాయి. ఏమీ మిగల్లేదని ఇంట్లో విలువైన టీవీ, ప్రిజ్, కూలర్ వంటి సామాన్లు పూర్తిగా పాడైపోయాయని రోదించారు. ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ వచ్చి పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్నేరు ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెన : మున్నేరు వాగు వరద ధాటికి ములకలపల్లి వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల వారధిగా ఉన్న ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఖమ్మం-మహబూబాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.