GST Refund Fraud Update : వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. కొందరు వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అధికారులతో కుమ్మక్కై రూ.45 కోట్లకు పైగా రిఫండ్ రూపంలో కాజేసినట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో వాణిజ్యపన్నుల శాఖ నల్గొండ డివిజన్ డిప్యూటీ కమిషనర్ పీతల స్వర్ణకుమార్, అబిడ్స్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ కె.వేణుగోపాల్, మాదాపూర్-1 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ పొదిల విశ్వకిరణ్, మాదాపూర్-2 సర్కిల్ డిప్యూటీ స్టేట్‌ట్యాక్స్ ఆఫీసర్ వేమవరపు వెంకటరమణ, మాదాపూర్-3 సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ మర్రి అనితలను రిమాండ్‌కు తరలించారు. దిల్లీకి చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మ, వ్యాపారులు వేమిరెడ్డి రాజారమేశ్‌రెడ్డి, ముమ్మగారి గిరిధర్‌రెడ్డి, కొండ్రగుంట వినీల్‌చౌదరిలను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై సీసీఎస్‌లో మొత్తం ఏడు కేసులు నమోదైనట్లు డీసీపీ ఎన్.శ్వేత శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
GST Refund Scam In Hyderabad : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన వేమిరెడ్డి రాజారమేశ్‌రెడ్డి వినర్థ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిల్లీకి చెందిన నీరజ్ సకుజా యోకో ఎలక్ట్రిక్ బైక్స్ సంస్థ, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఇందర్‌కుమార్ క్రాక్స్ ఎలక్ట్రిక్ బైక్స్, ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ముమ్మగారి గిరిధర్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన వినీల్‌చౌదరి కలిసి గ్రోమోర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్, అపెక్స్ ఎలక్ట్రిక్ బైక్స్, దిల్లీకి చెందిన సుప్రియా పాండే సుప్రియా ఎలక్ట్రిక్ బైక్స్, గౌరవ్ మ్యాగ్నమ్ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థల్ని ఏర్పాటు చేసినట్లు జీఎస్టీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయని రెంటల్ అగ్రిమెంట్, విద్యుత్ బిల్లులు సమర్పించారు. వాస్తవానికి వీరు వ్యాపారం చేస్తున్నట్లు జీఎస్టీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసినా అసలెక్కడా కార్యకలాపాలు నడపలేదు. దిల్లీకి చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్‌శర్మ సాయంతో నకిలీ బిల్లులు సృష్టించారు. ఆటోమొబైల్ విడిభాగాలు దిగుమతి చేసుకుని వాటితో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు తయారుచేసినట్లు బోగస్ బిల్లులు తయారు చేయించారు.
అధికారులతో కుమ్మక్కైన వ్యాపారులు : విడిభాగాలు దిగుమతి చేసుకున్నందుకు 5 శాతం జీఎస్టీ చెల్లించామని, బైకులు తయారుచేశాక 18 శాతం జీఎస్టీ చెల్లించామని బోగస్ రసీదులు సృష్టించారు. తమకు 13 శాతం జీఎస్టీ రిఫండ్ వస్తుందని నకిలీ బిల్లులతో దరఖాస్తు చేసి వేర్వేరుగా రూ.45.81 కోట్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకు లంచాలు ముట్టజెప్పారు. వారితో కుమ్మక్కై తతంగం నడిపించారు. తొలుత మాదాపూర్ సర్కిల్-1 సహాయ కమిషనర్ పొదిల విశ్వకిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నకిలీ బిల్లులతో రూ.23.78 కోట్ల రిఫండ్ తీసుకున్న వ్యవహారంలో వినర్ద్ ఆటోమొబైల్స్ డైరెక్టర్ వేమిరెడ్డి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేయగా ‘రిఫండ్’ మొత్తం రూ.23.78 కోట్ల నుంచి రూ.45.8 కోట్లకు పెరిగింది. ఇందుకు సహకరించిన అధికారులతోపాటు, చిరాగ్‌శర్మ, వ్యాపారులు అరెస్టు కాగా ఇంకా ఈ కేసులో నీరజ్ సకుజా, ఇందర్‌కుమార్, సుప్రియా పాండే, గౌరవ్‌లను అరెస్టు చేయాల్సి ఉంది.
GST ఆల్‌టైమ్ రికార్డ్- రూ.2.10 లక్షల కోట్లు దాటిన ఏప్రిల్ వసూళ్లు - GST Collection April 2024