Dhanu Sankranti Horoscope : సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. డిసెంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. 2025 జనవరి 14వ తేదీ వరకు సూర్యుడు ధనుస్సు రాశిలోనే సంచారం చేస్తాడు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు కానున్నారు. ఆ రాశులేమిటో చూద్దాం.
సూర్య సంచారంతో ఆరంభమయ్యే ధనుర్మాసం
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడి గ్రహ సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు ఈ నెల 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్సు రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
గ్రహ గతులతో మారే జాతకం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో సూర్యుని రాజుగా వర్ణిస్తారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రాంతి జరుపుకోవటం ఆనవాయితీ. అంటే ఒక రాశిలో సూర్యుడు ప్రవేశించాక ఆ రాశి వారికి జీవితంలో నూతన క్రాంతి మొదలైనట్లే! ధనుస్సంక్రాంతిలో ఈ రాశుల వారికి ఎలాంటి మేలు జరుగనుందో చూద్దాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ధనస్సు రాశి సూర్య సంచారం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ మాసం రోజులు ఉద్యోగులకు సానుకూల సమయం. ఉద్యోగాలలో పదోన్నతులు, జీతం పెరగడం వంటి శుభ ఫలితాలు చూస్తారు. చేపట్టిన ప్రతి పని విజయవంతమై మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలను పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీ విష్ణుమూర్తి ఆలయ సందర్శనం శుభప్రదం.
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడు. ధను సంక్రమణంతో సింహరాశి వారు ఈ మాసం కాలం అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఈ సమయంలో ఆత్మీయుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఈ మాసం రోజుల పాటు ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఇది అన్ని విధాలుగా సింహ రాశి వారికి అదృష్ట సమయం. గోదా రంగనాయక ఆలయాన్ని సందర్శించడం పుణ్యప్రదం.
తులారాశి
సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగులు గత కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ కాలం. శ్రీ రామాలయం సందర్శన మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సంక్రమణం జరిగే స్వస్థానమైన ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు చేపట్టిన ప్రతి పనిలోనూ శుభ ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఈ సమయం మంచి సమయం. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆదిత్య హృదయం పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి
ధను సంక్రమణంతో కుంభరాశి వారి జాతకమే మారిపోతుంది. ఈ జాతకులు సూర్య సంచారం కారణంగా అదృష్టవంతులుగా మారనున్నారు. కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలవుతాయి. సూర్యుని ఆశీర్వాదంతో ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు. వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. ఇది కుంభరాశి వారికి మంచి సమయం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం. జ్యోతిష్య శాస్త్రపరంగా గ్రహాల గతులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగని మిగతా వారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. చేసే వృత్తిని దైవంగా భావించి కష్టించి పని చేసే వారికి విజయలక్ష్మి, ధనలక్ష్మి ఎప్పుడు అండగా ఉంటుందన్న సంగతి మరువద్దు. కృషి మాత్రమే విజయానికి సులభమైన మార్గమని గుర్తుంచుకోవాలి.
శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.