FIR Filed Against Actor Raj Tarun : టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్-లావణ్యల ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిప్పుతోంది. ఇప్పటికే ఈ యంగ్ నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసిన నటి లావణ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబం రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చిందని చెప్పింది. తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది.
లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్‌తోపాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మయాంక్‌లను చేర్చారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
బాధితురాలు లావణ్య ఫిర్యాదు ప్రకారం : "2008 నుంచి రాజ్‌తో లావణ్యకు పరిచయం ఉంది. 2010లో ఆమెకు ప్రపోజ్ చేసి 2014లో రాజ్‌తరుణ్ లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌కు లావణ్య కుటుంబం రూ.70లక్షలు ఇచ్చింది. 2016లో తాను గర్భం దాల్చానని తర్వాత రాజ్‌తరుణ్ అబార్షన్ చేయించాడు. మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ ఆమె నుంచి దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరించారు." అని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లావణ్య ఫిర్యాదు మేరకు 420,493,506 సెక్షన్ల కింద రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే : సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించింది. అతనితో తనకు ప్రాణ భయం ఉందని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కావాలనే డ్రగ్ అడిక్ట్‌లాగా క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మస్తాన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని, రాజ్ తరుణ్ మాల్వీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని, అతను అన్ని రకాలుగా తనను ఉపయోగించుకుని, ఇప్పుడేమో మాల్వీతో ఉన్నాడని చెప్పింది. తనకు రాజ్‌తరుణ్ కావాలని, ఆయన లేకపోతే తాను బతకలేననంటూ వాపోయింది. తాజాగా బాధితురాలు సమర్పించిన ఆధారాల మేరకు పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు.
రాజ్‌తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya Comments on rajtarun