Film celebrities pay tribute to Ramoji Rao : సినీరంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు, తుదిశ్వాస విడవడం తీరని లోటని సినీప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి నివాళులర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
నటులు, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, దర్శక, నిర్మాతలు అశ్వినీదత్, దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్రీనువైట్ల, క్రిష్ నివాళులు అంజలి ఘటించారు. రామోజీరావు లేకున్నా, ఆయన ప్రస్థానం మాత్రం చిరస్థాయిగా నిలిచే ఉంటుందన్నారు. జర్నలిజం, సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పష్టం చేశారు. రామోజీరావు పార్థీవ దేహానికి ఇళయరాజా, మోహన్ బాబు, మంచు విష్ణు, హీరోలు వెంకటేశ్, నాగార్జున, కల్యాణ్‌రామ్, రఘుబాబు, తరుణ్ నివాళులర్పించారు.
సంగీత దర్శకులు కోటి, కీరవాణి, దర్శకులు రాజమౌళి, తేజ, సినీ గీతరచయితలు పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోస్, సినీ కథారచయిత విజయేంద్రప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కోనియాడారు. వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు సేవల్ని తలుచుకుని సీరియల్ నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఎంతోమందికి జీవనోపాధి కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు.
రామోజీరావు మరణం చాలా బాధాకారం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయనలోటు తీర్చలేనిది. రాబోయే తరాలకు రామోజీరావు ఒక మార్గదర్శి. ఆయన జీవితాంతం విలువలను పాటిస్తూ, ఆదర్శంగా నిలిచారు. - రాజేంద్రప్రసాద్ సినీనటుడు
రామోజీరావు సంస్థ ద్వారా 'తొలి చూపులోనే' సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది. నాలాగే ఎంతో మంది సినీతారలకు అవకాశం ఇచ్చారు. టీవీలోనూ రచయితలు, నటులను పరిచయం చేశారు. ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి రామోజీరావు. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్ సిటీ గొప్ప ఆస్తి. ఆయన మరణం కలచివేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - నందమూరి కల్యాణ్ రామ్, సినీనటుడు
బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు. ఆయన అన్నిరంగాల్లోనూ రాణించాడు. సినీరంగంలో విశేషంగా కృషి చేశాడు. ఆయన మరణం తెలుగుచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన మరణం బాధాకరం. - రాజామౌళి, సినీ దర్శకుడు
రామోజీరావు లేరనే వార్త చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో మాకుటుంబానికి మంచి సంబంధాలుండేవి. ఆయన ఎప్పుడు కలిసిన జీవితం గురించి చెప్పేవారు. కోట్ల మందికి ఆయన మార్గదర్శకుడు. ఈటీవీలో ప్రసారమైన వావ్ షోతో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. - సాయి కుమార్ సినీ నటుడు
రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao biography
మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field