FedEx Crimes In Hyderabad : సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఇరాన్‌కు తన పేరిట వెళ్లిన కొరియర్‌లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్‌తో పాటు 100 గ్రాముల ఎంఎండీఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. తాను ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్థులు వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేసి 6 గంటల పాటు పోలీస్ వేషధారణలో విచారించారు.
ఆ క్రమంలోనే బాధితుడిని బ్యాంకు ఖాతా వివరాలు చెప్పమనడం, బాధితుడి ఖాతాలో ఉన్న డబ్బును తమ అకౌంట్లో జమ చేస్తే 10 నిమిషాల్లో తిరిగి పంపిస్తామనడం, లేదంటే అరెస్ట్ తప్పదని వృద్ధుడిని సైబర్ నేరస్థులు బెదిరించారు. అయితే బాధితుడు వెంటనే అప్రమత్తమై తన ఖాతాలోని రూ.24 లక్షల 58 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి తరలించి వాటిని కాపాడుకున్నాడు. ఆ తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలో ఉన్న తన కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేస్తే ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ ఉంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. అనంతరం వారు చెప్పిన సూచనలు నమ్మి ఫాలో అయిన వృద్ధుడి ఖాతా నుంచి రూ. 2లక్షల 33 వేలు కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని, బాధితుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించి మళ్లీ ఆన్‌లైన్ వేదికగా విచారించారు.
బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి రూ.7లక్షల 11వేలు కాజేశారు. ఈ ఉదాహరణలు మచ్చుకు మాత్రమే. ఇలాంటివి రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు బాధితులు మోసపోయిన డబ్బును పోలీసులు హోల్డ్ చేసి, రీఫౌండ్ చేసేలా ప్రయత్నం చేస్తున్న మరోవైపు సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఇలాంటి మోసాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
"సైబర్ మోసాల పట్ల అప్రమత్తతే శ్రీరామరక్ష. మోసపూరిత కాల్స్‌కు స్పందించకూడదు. అసలు ఎలాంటి పార్సిల్ పంపనప్పుడు దేనికీ భయపడాల్సిన పనిలేదు. అనవసరంగా ఆందోళన చెందకుండా సైబర్ మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయాలి. www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలి." -శిఖా గోయల్, డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ నేరగాళ్ల ఫ్రాడ్ కాల్స్ - స్పందించారా ఇక అంతే సంగతులు! - Cyber Criminals Fake Calls