Road Accident in Krishna District Today : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి హైవేపై పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్, కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్ వాహనం ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమదంలో ఆరుగురు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులు కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన గండి ధర్మవర ప్రసాద్ (27), ఎస్ యానాంకు చెందిన రేవు నాగభూషణం (26), అమలాపురానికి చెందిన పేసింగు కనకరాజు (34), కాట్రేనికోనకు చెందిన చింతా లోవరాజు (32), మాగపు సోమరాజు (30), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ (42)గా పోలీసులు గుర్తించారు.
ఆ సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. కంటైనర్‌లో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి : ఈ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. తీవ్రంగా గాయపడి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో మత్స్యకారులు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Gudur Road Accident Today : తెలంగాణలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్, జేసీబీల సహాయంతో బోల్తా పడిన లారీని తొలగించారు. మృతులు గూడూరు సీఐ గన్‌మెన్‌గా పనిచేస్తున్న పాపారావు, స్థానికంగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్ అని పోలీసులు తెలిపారు.
రహదారి ప్రక్కన టీ తాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరూ అన్నదమ్ములని పోలీసులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడిన లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.