Farmers Struggling for Seeds in Karimnagar : రైతులు ఖరీఫ్ పంట సాగుకు సంసిద్దమవుతున్న తరుణంలో సర్కారు నుంచి అందాల్సిన సహాయానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడచూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోస పడుతున్నాడు. డిమాండ్ మేరకు అధికారులు విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో వారికి పాట్లు తప్పడం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీలుగు విత్తనాల కోసం రైతులు క్యూలో నిల్చోని తీవ్ర అవస్థలు పడ్డారు. ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు. గత యాసంగిలో ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా పంటలు ఎండిపోగా, మరోవైపు వడ్లు తడిసి రైతులు తీవ్రంగా నష్టాలపాలయ్యారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ వానకాలం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశ రైతుల్లో చిగురించింది.
విత్తు కోసం విపరీత రద్దీ - నాణ్యమైన విత్తనాల కోసం ఎగబడ్డ సాగుదారులు - Seed Mela in jagtial
Subsidy Seeds Shortage : వానాకాలం పంట కోసం జీలుగు విత్తనాలు మే మొదటి వారంలోనే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంతో అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో రోహిణీ కార్తె ముంగిట్లోకి వచ్చిన తర్వాత జీలుగ విత్తనాలు అందిస్తున్నారని రైతులు వాపోయారు. ఈ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం జీలుగు విత్తనాలకే డిమాండ్ ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జీలుగు విత్తనాల సరఫరాలో టెండర్ల ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు, ఎన్నికల కోడ్ కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగిందని అధికారులు వివరించారు. ఈ విత్తనాలు పంపిణీలో కాస్త ఆలస్యం జరిగినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జీలుగు విత్తనాల సరఫరాలో తాత్సారం జరిగిన నేపధ్యంలో సాధ్యమైనంత మేర విత్తనాల పంపిణీ వేగవంతం చేసి తమకు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
"ఈసారి వర్షాలు ముందుగా రావడంతో పంటలు సాగు కోసం ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ పంటకు సరిపడా విత్తనాలు లేక ఇబ్బందిపడుతున్నాం. గంటల తరబడి సేవా కేంద్రాల ముందు నిల్చుంటే పాస్ బుక్కు ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ పొలం ఉన్న వారికి కష్టమవుతుంది. గతంలో విత్తనాలు ఆలస్యం అయ్యి పంట దిగుబడి రాలేదు.ఈ సారైనా సమయానికి సరిపడా విత్తనాలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేయాలి." -రైతులు
జీలుగ విత్తనాల కొరత - గంటల కొద్ది రైతుల పడిగాపులు - చివరకు లేకుండానే? - less supply jeeluga seeds