Farmers Celebrations Due to Chandrababu Sign on Repeal Land Titling Act : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రజలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంపై రైతులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీకటి చట్టం రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రజా వ్యతిరేక చట్టాన్ని తెచ్చిన వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అనకాపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు అన్నారు.
NDA Government Repeal Land Titling Act in AP : చీకటి చట్టాన్ని రద్దు చేయడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ హాల్లో కేక్ కట్ చేసి న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. పింఛన్ పెంచుతూ చంద్రబాబు సంతకం చేయటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరులోని లాడ్జి సెంటర్లో దివ్యాంగుల సహకార సంస్థ మాజీ ఛైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Farmers Celebrations On Repeal Land Titling Act : ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తొలి రోజే సంతకం చేయడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.ఈ నేపథ్యంలో గన్నవరం పరిధిలోని రంగన్నగూడెంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. రైతు నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణ నేతృత్వంలో పొలాల్లో వేసిన సర్వే రాళ్లను లాగిపడేశారు. చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను చించేసి మంటల్లో తగలబెట్టారు.
Guntur Advocates on Land Titling Act : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలై ఉంటే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని గుంటూరు జిల్లా న్యాయవాదులు అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద సంబంరాలు చేసుకున్నారు.