water levels Reduced in Nizamsagar : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. వానాకాలం సీజన్లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు విడతల వారీగా నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు రెండు తడులకు సరిపోయేలా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వానాకాలం పంటలు పండాలంటే మరో ఆరు తడులుగా విడుదల చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో సింగూర్ నుంచి ఆరు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. నిజాంసాగర్‌లో నీటి నిల్వలు తగ్గితే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూర్ నుంచి జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా సింగూర్ నీటిని విడుదల చేసేందుకు అవకాశం లేనట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యామ్నయంగా కొండపోచమ్మసాగర్ నుంచి నీటి విడుదల చేస్తేనే ఆయకట్టు రైతుల ఆశలు నిలుస్తాయని అంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. వానాకాలం సీజన్ లో పంటలకు 10.6 టీఎంసీలు అవసరం అవుతాయి. ఈ ప్రాజెక్టు కింద 1.15లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. 2018లో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీవాగు మీదుగా నిజాంసాగర్ కు రెండు టీఎంసీల గోదావరి జలాలను తరలించారు.
ప్రస్తుతం అలాగే తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో సమృద్ధిగా నీటి నిల్వలున్నాయి. ఉభయ జిల్లాల ప్రజాప్రతినిధులు కొండపోచమ్మసాగర్ లేదా సింగూర్ నుంచి నీటి విడుదలకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి జలాల విడుదలకు ఆమోద ముద్రవేయించాలని రైతులు కోరుతున్నారు. పర్యాటకంగానూ అభివృద్ది చేయాలని కోరుతున్నారు. వర్షాలు పడకుంటే నిజాంసాగర్ ఆయకట్టు రైతులు సాగు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వెంటనే నీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
"నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 4టీఎంసీల నీరు ఉంది. వానాకాలం సాగుకు ఈనీరు సరిపోదు. వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే ఇబ్బందేమి లేదు. లేని పక్షంలో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించాము". - సాల్మన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నిజాంసాగర్ ప్రాజెక్టు