Farmer Suicide Attempt in Front of Tehsildar Office: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రెవెన్యూ, పోలీసు అధికారులు అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని 108 అంబులెన్సులో కర్ణాటకలోని బళ్లారి విమ్స్ వైద్యశాలకు తరలించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం: బొమ్మనహాళ్ మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో బాధిత రైతు సుంకన్నకు 6.60 ఎకరాల భూమి ఉంది. అయితే అందులో తన 2.50 ఎకరాల పొలం కబ్జాకు గురైందని రైతు ఆరోపించాడు. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన శాంతమూర్తి అనే వ్యక్తి ఒక ఎకరా, గోవిందవాడ గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు ఒక ఎకరా చొప్పున వారి పేరుపై పాస్ బుక్ చేయించుకుని సర్వ హక్కులూ పొందుతున్నట్లు తెలిపాడు.
నమ్మించి మోసం చేసిన కుమారుడు- తల్లిదండ్రుల ఆత్మహత్య - Couple Commits Suicide due to Debts
ఈ భూముల కోసం 15 సంవత్సరాలుగా బొమ్మనహాళ్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నట్లు వాపోయాడు. తన సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లినా పట్టించుకోవట్లేదన్నాడు. అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా తమ గోడు పట్టించుకోలేదని తెలిపాడు. పైగా బొమ్మనహాల్ ఎస్సై తనపై, తన ఇద్దరు కుమారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారని వాపోయాడు. ఇక అధికారులు తనకు న్యాయం చేయరనే ఉద్దేశంతో జీవితంపై విరక్తి చెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించినట్లు రైతు వెల్లడించారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బళ్లారి విమ్స్ వైద్యులు పేర్కొన్నారు. బొమ్మనహల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలును సంప్రదించగా, రైతు సుంకన్న కార్యాలయం లోపలికి రాలేదన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వెంటనే బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. రైతు సుంకన్న వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డులు గాని, ఆధారాలు కానీ లేవని, భూ సమస్యపై రైతులు గత కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్వేయర్ భూమి కొలతలు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా రైతు సుంకన్న ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. ఇప్పుడు రెండోసారీ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.