Andhra Avakaya Manufacturers Troubles in AP : ఆవకాయ అనే పదం వింటేనే ఎవరికైన నోరూరుతుంది. అందులో ఆంధ్ర ఆవకాయ అంటే ఒక్కసారైన రుచి చూడాలని మనసు ఉర్రూతలూగుతోంది. వేసవికాలం వస్తే చాలు రకరకాల పచ్చళ్లతో తెలుగులోగిళ్లు కళకళలాడుతాయి. ముక్కలు కోయటం నుంచి అవి జాడీల్లోకి చేర్చేవరకు చాలా పెద్ద తతంగమే ఉంటుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు కలిసిమెలసి పచ్చళ్ల తయారీలో నిమగ్నమైపోతారు. అయితే గతంతో పోల్చితే ఈ సారి ఆ జోరు తగ్గిందనే చెప్పొచ్చు. అసలు ఆంధ్ర ఆవకాయకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశవిదేశాలకు ఆవకాయ రుచులు అందిస్తోన్న హరిపాలెం : మామిడికాయల కుప్పలు ఆ పక్కనే కత్తిపీటలు ముందేసుకుని చకాచకా వాటిని తరుగుతున్న మహిళలు. మరోవైపు వాకిళ్ల ముంగిట ఎండబెట్టిన ఆవకాయ ముక్కలు ఇవీ అనకాపల్లి జిల్లా హరిపాలెంలో ఎక్కడ చూసిన కనిపించే దృశ్యాలు. వేసవి వచ్చిందంటే చాలు పచ్చళ్ల తయారీదారులతో ఇక్కడి వీధులన్నీ కిటకిటలాడుతాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసిమెలసి పచ్చళ్ల తయారీలో నిమగ్నమైపోతారు.
ఆవకాయ కుటీర పరిశ్రమకు అనకాపల్లి జిల్లా హరిపాలెం ప్రసిద్ధి పొందింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ గ్రామంలో తయారైన ఆవకాయ దేశవిదేశాలకు అమోఘమైన రుచులను అందిస్తోంది. వేసవిలో సీజన్ ప్రారంభం నుంచి కొత్త ఆవకాయ సందడి కనిపిస్తుంది. దాదాపు 100 కుటుంబాలు పచ్చళ్ల తయారీపైనే జీవనోపాధి పొందుతున్నారు.
తీపి ఆవకాయ అంటేనే అందరికీ ఆ గ్రామం గుర్తుకు వస్తుంది : సంప్రదాయ రీతిలో మామిడికాయలను సేకరించి వాటిని తరగడం, ముక్కలు ఉప్పులో వేసి ఎండబెట్టడం. ఏడాది పొడవునా నిల్వ ఉండే విధంగా ఆవాల పిండి, కారం, మెంతులు, బెల్లం, నూనె రంగరించి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆవకాయ అందిస్తారు ఈ ప్రాంతం వాసులు. ప్రధానంగా హరిపాలెం అంటేనే తీపి ఆవకాయకు ప్రసిద్ధి. ఎండబెట్టిన మామిడి ముక్కలు కనీసం రెండేళ్ల వరకు పాడవకుండా ఉంటాయి.
వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం, నూనె కలుపుకునే విధంగా మాగాయను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి తయారీదారులకు కష్టకాలం నడుస్తోంది. తీపి ఆవకాయ కోసం వినియోగించే కలెక్టర్‌కాయ ఉత్పత్తి తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్ నుంచి కాయ రావడంతో మొదలైన పని మే నెల మొత్తం ఆవకాయ పెట్టడంతో బిజీబిజీగా ఉంటారు. అయితే అనేక సమస్యలు తయారీదారులను చుట్టుముట్టడంతో మే పూర్తికావస్తున్నా ఆవకాయ తయారీ ఊపందుకోలేదు.
"ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆవకాయ తయారీదారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు మామిడి ముక్కలను ఎండబెట్టడం కోసం నానా తంటాలు పడుతున్నాము. మరోవైపు ముడిసరకు ధరలు విపరీతంగా పెరగడంతో ఆర్థికంగా భారమైంది. పోనీ అప్పోసొప్పో చేసి ఆవకాయ పెడితే పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని గుబులు. తీరా నష్టాల నివారణకు పచ్చళ్ల రేటు పెంచితే కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ప్రభుత్వమే చొరవ చూపి ఆవకాయ, ఇతర పచ్చళ్ల విక్రయాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము." - లక్ష్మి,, ఆవకాయ తయారీదారులు