Sale Of Fake Oraganic Fertilizers In Guntur : 'డబ్బు' మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉంది. దీన్నే అక్రమార్జనకు అనువుగా తీసుకుని కొంతమంది వ్యక్తులు తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలోనే బాగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. దురాశతో ఆర్గానిక్ ఎరువుల పేరుతో ఉప్పునకు రంగు కలిపి ఆకర్షణీయ ప్యాకెట్లలో నింపి ఆమాయక రైతులకు అంటగడుతున్నారు. దీనికి వారు పెట్టిన పేరు సూక్ష్మ పోషకాలు, కిలో 25 కిలోల సంచుల్లో నింపి పండ్ల తోటలు, నర్సరీలు, కూరగాయల తోటల్లో వాడితే అధిక దిగుబడులొస్తాయని నమ్మిస్తున్నారు. వారి లక్ష్యం బిందు, తుంపర్ల సేద్య పరికరాలు వాడుతున్న రైతులే కావటం గమనార్హం. సెప్టెంబరులో ఏపీలోని గుంటూరులో సరైన బిల్లుల్లేని రూ. 13.68 లక్షల విలువైన (వాటి సంచులపై ఉన్న ధరలను బట్టి) సరుకును వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని ప్రయోగశాలలో పరీక్షించగా అవి ఉప్పు, గులాబీ రంగు కలిపిన లవణం మాత్రమే అని నిర్ధారణ అయింది.
గుంటూరులో పట్టుబడిన ఆర్గానిక్ ఎరువుల తయారీ కంపెనీ ఉత్తర్‌ప్రదేశ్ సహరాంపూర్ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అహుజ పేరుతో అక్కడి నుంచి ఏటుకూరు రోడ్డులో ఉన్న పార్సిల్ కార్యాలయానికి దిగుమతి అయ్యాయి. 25 కిలోల సంచి ధర రూ. 5,790గా, కిలో ప్యాకెట్ విలువ రూ. 300గా ముద్రించారు. 25 కిలోల ఎరువుల బస్తాలు 3 వేల కిలోలు, కిలో ప్యాకెట్లు 3 వేల కిలోలు, మొత్తంగా 6వేల కిలోల ఎరువులు అధికారులు పట్టుకున్నారు.
'వేసిన విత్తనం మొలకెత్తడం లేదు - మొలకెత్తిన మొలకలు బతకడం లేదు' - Cotton Farmers Problems
పోలీసులు అక్కడికి వెళ్లలేరన్న నమ్మకంతో : ఆర్గానిక్ ఎరువుల పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా రూ.కోట్ల విలువైన వ్యాపారం నడుస్తోంది. వ్యవసాయశాఖ తనిఖీల్లో పట్టుబడినప్పుడు రవాణా చిరునామా ఆధారంగా కొందరిని గుర్తిస్తున్నా వారు కేవలం పాత్రధారులు మాత్రమే. వారిని నడిపిస్తున్నవారు వేరే ఉన్నారు. పోలీసులకు వ్యవసాయశాఖ ఫిర్యాదు చేస్తుంటే అనుకున్నంత దర్యాప్తు జరగడం లేదు. దీన్నే అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు. ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటే పోలీసులు అంతవరకు వెళ్లరన్న నమ్మకంతో అక్రమార్కులు అక్కడి కంపెనీల పేరుతో ఇక్కడ తయారు చేస్తున్నారు. లేదా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పోలీసు, వ్యవసాయశాఖ సమన్వయంతో పని చేసి నకిలీ ఎరువులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా ఆన్‌లైన్‌లో ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అధికారులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక్క శాతం కూడా ఎరువు లేదు : సూక్ష్మ పోషకాలతో కూడిన ఆర్గానిక్ ఎరువులంటూ 13.0.45; 0.0.52; 20.20.0; 19.19.19; 12.61.0; 00.52.34 ఇలా వివిధ రకాల పేర్లతో ఆకర్షణీయ ప్యాకెట్లలో రైతులకు విక్రయిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటటంటే అందులో ఒక్క శాతం కూడా ఎరువు లేకపోవడం. దీన్ని పంటలకు వాడితే నష్టం తప్ప ఎలాంటి లాభం చేకూరదు. ఇలా నకిలీ ఆర్గానిక్ ఎరువులు ఎంత కాలం నుంచి విక్రయిస్తున్నారన్న విషయం తెలియలేదు. మరోవైపు మట్టి నింపి జీవన ఎరువులంటూ రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఇంకొందరు ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల పేర్లు పెట్టి ఆర్గానిక్ ఎరువులంటూ విక్రయిస్తున్నారు. వీటిని కొన్న రైతులు నీటిలో కలిపి పంటలకు వాడుతున్నారే తప్పా అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు.
ఆర్గానిక్ ఎరువులు మిశ్రమాలు దేశీయంగా తయారుకావు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్నారు. ఇందుకు భిన్నంగా నకిలీల్లో ఉప్పు, మెగ్నీషియం, సల్ఫేట్ రంగులు కలిపి విక్రయాలు చేస్తున్నారు.
Illegal seeds: భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం.. నిందితుల అరెస్ట్