Facial Recognition System For Catch Rowdies : ‘ఫలానా రౌడీ షీటర్ మీ పట్టణంలోని ప్రధాన కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. వెంటనే అప్రమత్తమవ్వండి’ అంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు సందేశం వస్తుంది. వెంటనే అక్కడికి గస్తీ బృందాల్ని పంపించి, అదుపులోకి తీసుకుంటారు. నేరం చేయక ముందే కట్టడి చేస్తారు.
‘హిస్టరీ షీటున్న వ్యక్తి ఓ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని, ఫలానా ప్రాంతం వైపు పారిపోతున్నాడు’ అంటూ మరో అప్రమత్తత సందేశం వస్తుంది. ఆ ప్రాంతంలోని పోలీసులు అక్కడికి వెళ్లి, ఆ నేరగాణ్ని అరెస్టు చేస్తారు. నేరం చేసిన వ్యక్తి తప్పించుకోకుండా పట్టుకుంటారు.
రాష్ట్రంలో రౌడీషీటర్లు, హిస్టరీ షీట్లున్న నేరచరితులపై ఏపీ పోలీసులు ఇలాంటి సాంకేతిక నిఘా పెట్టనున్నారు. ముఖకవళికలను గుర్తించే వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ -ఎఫ్‌ఆర్‌ఎస్) సాంకేతికత కలిగిన సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తూ.. నేరాలకు పాల్పడక ముందే నియంత్రించటం, ఏదైనా నేరం చేస్తే వెంటనే అదుపులోకి తీసుకోవటం దీని ప్రధాన లక్ష్యం. మూడు నెలల్లోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను పలు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసి, సత్ఫలితాలు సాధించారు.
గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు
జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం సీసీకెమెరాల నిర్వహణకూ నిధులివ్వలేదు. దీంతో తమనెవరూ పట్టుకోలేరులే అన్నట్లుగా నేరగాళ్లు పేట్రేగిపోయారు. గత ఐదేళ్లలో నేరాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నేరానికి పాల్పడితే మరుక్షణమే పోలీసులకు పట్టుబడేలా సాంకేతిక నిఘా వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో ఆదేశించారు.
కొత్తగా ఫొటోలు తీసి : రాష్ట్రంలో 41,698 మంది హిస్టరీ షీటర్లు, 28,658 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 12 వేల మందికి సంబంధించి పాత ఫొటోలే పోలీసుల వద్ద ఉన్నాయి. ప్రస్తుతం వారి ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో వారిని గుర్తించటం కష్టం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నేరచరితుల ఫొటోలను మళ్లీ సేకరిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14 వేలకు పైగా కెమెరాల్లో 1000కి పైగా కెమెరాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతికత ఉంది. మిగతా 13 వేల కెమెరాల్లోనూ దాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన లైసెన్సులను పోలీసు శాఖ తీసుకుంటోంది. ప్రైవేటు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకూ ఈ సాంకేతికతను పెట్టుకోవాలని ప్రోత్సహించనుంది.
పోలీసులపై రౌడీషీటర్ దురుసు ప్రవర్తన- సెంట్రల్ జైలు వద్ద హల్చల్ - Rowdy Sheeter Halchal
డేటా బేస్‌కు అనుసంధానం : తాజాగా సేకరిస్తున్న నేరచరితుల ఫొటోలన్నింటినీ వారి వివరాలతో పోలీస్ డేటా బేస్‌కు అనుసంధానిస్తారు. దానిలో రికార్డయిన రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు ఈ సీసీకెమెరాలున్న ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడి నుంచి సంబంధిత ఎస్‌హెచ్‌వోకి సందేశం అందుతుంది. రౌడీషీటర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరెవర్ని కలుస్తున్నారు? అనేది నిరంతరం గమనించే వెసులుబాటు కలుగుతుంది. ఫలితంగా వారు నేరాలకు పాల్పడకుండా నియంత్రించేందుకు వీలవుతుంది.