Doctors Advice for Eye Care to Celebrate Diwali Safely : దీపావళి అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆనందకరంగా జరుపుకునే పండుగ. ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ, ఇంట్లో కుటుంబాలతో, వీధిలో స్నేహితులతో ఆనందంగా గడపుతుంటారు. మరి దీపావళి అందరి ఇళ్లల్లో ఆనందకేళి కావాలంటే పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నేత్ర వైద్యులు అంటున్నారు. ఏటా దీపావళి పండుగ సమయంలో టపాసుల కారణంగా సరోజినీ దేవి నేత్ర ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అత్యవసర విభాగాలకు 100పైగా బాధితులు వస్తుంటారు. బాధితుల్లో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు చెందిన కన్సల్టెంట్ ఆఫ్తల్మాలజిస్టు డాక్టర్ శాలిని సింగ్ పలు సూచనలు చేశారు.
గాయమైతే ఇలా చేయండి
- గాయపడిన వ్యక్తిని వెంటనే నేత్ర సంరక్షణ నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలి.
- కంటిలో నలకలు పడితే శుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావంతో మృదువుగా శుభ్రం చేయాలి. సబ్బు లాంటివి వాడకూడదు.
- కంటికి గాయమైన చోట శుభ్రమైన పొడి వస్త్రంతో కప్పాలి. లేదంటే కన్ను మూసి ఉంచాలి.
ఇవి చేయకండి
- గాయమైన కంటిని ఎట్టి పరిస్థితిల్లోనూ నలపకూడదు.
- వైద్యులు చెప్పే వరకు ఆయింట్మెంట్ రాయకూడదు. ఇంటి చిట్కాలు, సొంత ప్రయోగాలు చేయకూడదు.
- కంటిలో ఇరుక్కున్న టపాసుల తునకలను మీ సొంతంగా మీరు తొలగించే ప్రయత్నం చేయొద్దు.
ఇవి తప్పనిసరిగా పాటించాలి
- అధీకృత తయారీ సంస్థలకు చెందిన టపాసులే కొనుగోలు చేయాలి. రెండు రోజుల ముందే వాటిని కోనుగోలు చేసి ఎండబెట్టాలి.
- టపాసులను పిల్లలకు అందకుండా అట్ట డబ్బాల్లో పెట్టి దూరంగా పెట్టాలి. వాటిని నూనె, గ్యాస్ సిలిండర్ లాంటి మండే పదార్థాలకు దూరంగా ఉంచాలి.
- పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు టపాసులు కాల్చేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
- టపాసులను వెలిగించడానికి పొడవైన కొవ్వొత్తి ఉపయోగించాలి.
- ఒకవేళ మంటలు చెలరేగితే వెంటనే ఆర్పడానికి ముందుగానే రెండు బక్కెట్ల నీళ్లు దగ్గర పెట్టుకోవాలి. ఒంటికి గాయాలైతే పరిశుభ్రమైన దుప్పటిలో చుట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
- టపాసులు కాల్చే సమయంలో కంటికి గాయాలు కాకుండా ముందు జాగ్రత్తగా కళ్ల అద్దాలు ధరించాలి.
- టపాసులు చేతిలో పట్టుకుని వెలిగించకూడదు. వెలిగించేటప్పుడు వాటిపై వంగకూడదు. వాటికి కొంచెం దూరంగా ఉండి వెలిగించాలి. డబ్బాలు, సీసాలు కింద టపాసులు పెట్టి పేల్చకూడదు.
- టపాసులు వెలిగించేటప్పుడు మందంగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. అవి కూడా బిగుతుగా ఉండాలి. వదులుగా ఉంటే మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది.
- భారీగా గాలి ఉంటే ఎలాంటి బాణాసంచా కాల్చకూడదు.
అత్యవసర సేవలకు (24 గంటల పాటు)
ఎల్వీవీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, సరోజనీ దేవి ప్రభుత్వ నేత్ర ఆసుపత్రులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.
ఎల్వీవీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ - 040-68102100, 7331129653, 68102848
సరోజనీ దేవి ప్రభుత్వ నేత్ర వైద్యశాల- 040-23317274
వెలుగుల పండుగ వేళ : టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవొద్దు!