Illegal Liquor Supply Control in Telangana : రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టేది అబ్కారీ శాఖ. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నఅక్రమార్కుల భరతం పట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున రూ.3,000 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేస్తున్నారు. అయితే 2023-24 ఆర్థిక ఏడాదిలో వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రావడంతో లిక్కర్ కంటే దాదాపు రెండు కోట్ల కేసుల బీర్ల విక్రయాలు అదనంగా జరిగాయి.
ఎన్నికల నియమావళి కారణంగా ఆశించిన స్థాయిలో బీరు ఉత్పత్తి లేకపోవడంతో డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోయినట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. మూడో షిప్ట్‌లో బీర్లు ఉత్పత్తి చేసేందుకు బ్రీవరీలకు అనుమతి ఇచ్చినట్లయితే, మరో యాభై లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్ముడుపోయేవని, తద్వారా రాబడి కూడా పెరిగి ఉండేదని అంచనా వేస్తోంది.
హైదరాబాద్ పరిసరాల్లోనే 70 శాతం మద్యం విక్రయం : రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉంటుంది. సాధారణంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్‌ల ఫీజు, మద్యం దరఖాస్తులు ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.14,570 కోట్ల రాబడి రాగా, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.15,997 కోట్లు ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవి కాకుండా కొత్తగా మద్యం లైసెన్స్‌లు ఇవ్వడానికి 2023 ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ద్వారా 1,31,964 దరఖాస్తులు వచ్చాయి. వీటికి గానూ ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,639 కోట్లు ఆదాయం ఆయాచితంగా వచ్చింది. ఇది కాకుండా మద్యం లైసెన్స్‌లకు ప్రతి ఏడాది దాదాపు రూ.2,000 కోట్లు, బార్లు, క్లబ్‌లు తదితర లైసెన్స్‌ల ద్వారా మరో రూ.1000 కోట్ల మేర రాబడి వస్తుంది. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకట్ట : అయితే రాష్ట్రంలో యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాగే ఎక్సైజ్ శాఖ గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవడం, కల్తీ కల్లు, గంజాయి, మాదకద్రవ్యాలు లాంటివి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
సరిహద్దు తనిఖీ కేంద్రాలను మరింత పటిష్ఠం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిలువరించడం, గంజాయి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అక్రమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నియంత్రించినట్లయితే ఎక్సైజ్ శాఖ ద్వారా మరో రూ.2000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.