Excise and Commercial Tax Dept Controversy in Telangana : రాష్ట్రంలో ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆబ్కారీ శాఖ పన్ను చెల్లింపుల్లో ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్య పన్నుల శాఖ సోదాలు నిర్వహించింది. ఇప్పుడిది ఆసక్తికరంగా మారింది. తాజాగా హాలోగ్రామ్‌ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం మద్యం విక్రయాలు ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న హాలోగ్రామ్ విక్రయాలపై ఆశించిన రీతిలో జీఎస్టీ చెల్లించకపోవడం కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.29,985 కోట్ల వ్యాట్ ఆదాయం పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలపై వచ్చాయి.
అంతకు ముందున్న ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేవలం రూ.460 కోట్లు అధికం. ఇది కేవలం 2 శాతం వృద్ధి మాత్రమేనని తెలుస్తోంది. గతంలో ఏటా కనీసం పది శాతం మేర ఆదాయం పెరిగేది ఇప్పుడిదే వాణిజ్య పన్నుల శాఖ అనుమానానికి కారణమైంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవిని నియమించింది. ఆమె వ్యాట్, జీఎస్టీ రాబడులపై సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలపై ఆరా తీశారు. రెండు డిస్టిలరీల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. డిస్టిలరీల్లో మద్యం తయారీకి అవసరమైన ముడిసరకు, నీటి వినియోగం, విద్యుత్ వాడకం తదితర అంశాలను పరిశీలించి, ఒక నివేదికను తయారు చేశారు.
ఈ క్రమంలో డిస్టిలరీల్లో ఉత్పత్తి అవుతున్న మద్యం ఆబ్కారీశాఖ గోదాముల ద్వారా సరఫరా కాకుండా పక్కదారిలో మళ్లించడం వల్లనే రాబడి తగ్గిందనే అనుమానం వచ్చింది. అందులో భాగంగా డిస్టిలరీల నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే మద్యం వ్యాపార లావాదేవీల్లో ట్రేస్ అండ్ ట్రాకింగ్ సేవలు అందిస్తున్న సి-టెల్ కార్యాలయంలోనూ వాణిజ్యపన్నుల శాఖ తనిఖీలు చేసి వివరాలు సేకరించింది.
హాలోగ్రామ్‌ల విక్రయంపై జీఎస్టీ ఎగవేత గుర్తింపు : ఎక్సైజ్ అకాడమీలో ఉన్న హాలోగ్రామ్‌ల తయారీ కేంద్రం, పంపిణీ సంస్థల్లోనూ సోదాలు చేశారు. మద్యం విక్రయాలపై వ్యాట్ మాత్రమే విధించే అవకాసం ఉంది. హాలోగ్రామ్‌ల విక్రయాలకు మాత్రం జీఎస్టీ వర్తిస్తుంది. హాలోగ్రామ్‌ల అమ్మకంపై 2017 నుంచి జీఎస్టీ చెల్లించడం లేదని గుర్తించారు. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్లను డిస్టిలరీలు, బ్రూవరీలు, డిపోలకు విక్రయించినందుకు జీఎస్టీ చెల్లించాలంటూ ఎక్సైజ్ శాఖకు ఇటీవల షోకాజ్ నోటీసు ఇచ్చింది. 2017-18 నుంచి 2023-24 వరకు రూ.302.98 కోట్ల విలువైన హాలోగ్రామ్లను విక్రయించినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
హాలోగ్రామ్ ఒక్కోటి 30 పైసలు చొప్పున విక్రయించినట్లు దానిపై రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించాలని వివరించారు. కొంతకాలంగా రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదం తాజాగా నోటీసుల జారీతో తారస్థాయికి చేరింది. వాస్తవానికి నోటీసులో పేర్కొన్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు ఆబ్కారీశాఖ రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించినట్లయితే అందులో సగం కేంద్రానికి జమ చేయాలి. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.27 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయంపై ఉన్నతాధికారులు ఆచితూచి ముందుకెళ్లే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు శాఖలకు ఒకే అధిపతి ఉన్నా ఇలా వివాదం తలెత్తడం ఆశ్చర్యపరుస్తోంది.
రాష్ట్రంలో వ్యాట్ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం