EX MD Madhusudhan Reddy Scams in FiberNet : ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధసూధన్‌రెడ్డి తీరు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆ సంస్థలో సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు, హెచ్‌ఆర్ విభాగానికి మేనల్లుడు ఇంఛార్జ్. ఆయన సొంత జాగీరులా సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి, కోటరీకి పంచిపెట్టారు. జగన్ సర్కార్ హయాంలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు చూస్తే అవాక్కయ్యే పరిస్థితి.
2019లో ఏటా రూ.7.08 కోట్లు ఉన్న సంస్థ జీతాల పద్దును, ఏకంగా రూ.48 కోట్లకు పెంచారు. అవసరం లేకున్నా సిబ్బందిని నియమించి, వారికి జీతాల పేరుతో ఐదు సంవత్సరాల్లో సుమారు రూ.200 కోట్లు పంచిపెట్టారు. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు ద్వారా ప్రతి సంవత్సరం రూ.12 కోట్ల చొప్పున దోచిపెట్టారు. ఇప్పుడు ఆ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు తెరవకుండానే, అప్పటి అక్రమాల ఆధారాలను ధ్వంసం చేసేందుకు మాజీ ఎండీ కోటరీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
FiberNet Irregularities 2024 : మరోవైపు కీలకమైన ఫైనాన్స్, పరిపాలన, హెచ్‌ఆర్ విభాగాల పర్యవేక్షణను మధుసూదన్‌రెడ్డి సన్నిహితులకే అప్పగించినట్లు తెలుస్తోంది. వారంతా సంస్థలో జరిగిన అక్రమాలను బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. కొందరు సిబ్బంది ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారన్న సమాచారంతో గత నెల నాలుగో తేదీ నుంచి విజయవాడలోని సంస్థ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఈ-ఆఫీసు ఇక్కడ పనిచేయదు : ఫైబర్‌నెట్ సంస్థ ఎండీగా మధుసూదన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక, ఈ-ఆఫీసు నిలిపేశారు. ఫైళ్లు మాన్యువల్‌గా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు దస్త్రాలను సిబ్బంది ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై రూ.30 లక్షల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లను కోటరీ ఇప్పటికే ధ్వంసం చేసింది. వాటిలో వ్యక్తిగత చెల్లింపుల కాగితాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎవరికి చెల్లించారనే వివరాలు దొరక్కుండా ఇలా చేశారు. ఈ క్రమంలోనే ఫైనాన్స్ విభాగంలో ఓచర్ మాత్రమే ఉంచి, బిల్లులు లేకుండా చేశారు. ఇలాంటి వాటిలో మరికొన్ని
- సంస్థ ఎండీ వాహనంతో పాటు మరో రెండింటికీ బిల్లులు పెట్టి ప్రతినెలా సుమారు రూ.3 లక్షల వరకు అదనంగా డ్రా చేసేవారు. ఆ వాహనాలు ఎవరివి?
- ప్రింటర్లు లేకుండా, వాటికి క్యాట్రిడ్జ్‌లు కొనుగోలు చేసినట్లు, నెలకు రూ.1.50 లక్షలు ఖర్చుచూపారని తెలుస్తోంది.
- ఎన్నికలకు ముందు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా రెండు రోజుల్లో రూ.20 లక్షల చెల్లింపులు చేయించి, వాటి బిల్లులను చింపేశారని విశ్వసనీయ తెలుస్తోంది.
- జిల్లాల్లోని కొందరు నెట్‌వర్క్ మేనేజర్ల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమచేసి, ఆ మొత్తాన్ని ఆఫీసు పనుల కోసం జమ చేసినట్లు గోల్‌మాల్ చేశారని తెలిసింది.
ఫైబర్‌నెట్, వైఎస్సార్సీపీ నియామక సంస్థగా మారిందా? : ఫైబర్‌నెట్ సంస్థలో అవసరం లేకున్నా 2022 నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల సిఫారసుతో సిబ్బంది నియామకాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 120 మంది ఫీల్డు సిబ్బందిని మే 30న విధుల నుంచి తప్పించినట్లు, జూన్ 4న ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది. వారిని విచారిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందని ఇలా చేశారని సమాచారం.
YSRCP Irregularities in AP Fibernet Company : సంస్థలో అన్ని కేడర్లతో కలిపి 1,299 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందులో శాశ్వత సిబ్బంది ఇద్దరే. మిగిలినవారంతా సిఫార్సులతో వచ్చినవారే. పార్టీ కోసం పనిచేసేవారికి ఉపాధి కల్పించేలా, ఫీల్డ్ సిబ్బంది జాబితాలో వారి పేర్లను చేర్చి సంస్థ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. వారిలో వైఎస్సార్ జిల్లావారే అత్యధికం. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ కార్యాలయాల్లో 110 మంది ఫీల్డ్ సిబ్బందిని గత సర్కార్ నియమించింది. ఈ వ్యవహారం మొత్తం సంస్థలో ఈడీ హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న జగన్మాయగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సోదరుడికి ఖర్చు లేకుండా : మధుసూదన్‌రెడ్డి సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టును అప్పగించారు. ఫైబర్‌నెట్ ప్రసారాలు చేసే వైర్లు తెగిపోయినా, స్తంభాలు విరిగినా వాటిని గుత్తేదారే సరిచేయాలి. కానీ, సంస్థ ఫీల్డ్ సిబ్బందితో ఈ మరమ్మతులు చేయించినట్లు సమాచారం. దీంతో సోదరుడికి ఖర్చు లేకుండా లబ్ధి చేకూరిందని తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అక్రమాలకు నిలయంగా ఫైబర్‌నెట్ - త్వరలో విచారణ కమిటీ - AP State Fibernet Ltd