Ex CM KCR To Attend Telangana Assembly Sessions Today : మూడోరోజు శాసనసభ సమావేశాల్లో ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో దాదాపు ఏడు నెలలు తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం ప్రాచుర్యం సంతరించుకుంది.
అసలు అధికార పక్షాన్ని కేసీఆర్ ఏవిధంగా ఎదుర్కొంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బడ్జెట్ సెషన్స్ రోజు కేసీఆర్ హాజరవడంతో అసలు మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, ఆయనకు మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు సడెన్గా ప్రతిపక్షంలో కూర్చోవడంతో అసలు ఆయన సభలో ఉంటారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు మాత్రం బీఆర్ఎస్ చతికిలపడేలా చేశాయనే చెప్పాలి. పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. ప్రమాణస్వీకారం కూడా విడిగా చేశారు. ఇదే అధికారపక్షానికి ఆయుధంగా మారి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, వచ్చి ప్రసంగించాలని విమర్శలు చేసేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పదేపదే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం విమర్శలు : తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ మొదటి రెండు రోజులు కేసీఆర్ సభకు హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని ప్రస్తావించారు. కానీ మొదటనే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తారని ప్రకటన విడుదల చేశారు. అందుకు అనుగుణంగా మాజీ సీఎం కేసీఆర్ నేడు శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ఆయన హాజరవుతారు.