Ex CM KCR meets BRS MLAs and Activists on Third Day : నాడైనా.. నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ తయారు చేస్తుందని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దామని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూడో రోజు జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన నేతలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కొందరు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోతారని అలాంటి వారి గురించి కార్యకర్తలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదని చెప్పారు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా బీఆర్ఎస్కే ఉందని పేర్కొన్నారు. కొన్నిసార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారని హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని గుర్తు చేశారు. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందేనని నేతలకు సూచించారు.
జగిత్యాల ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీని వీడిన నేపథ్యంలో ఆయనని ఉద్దేశించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగోళ్లలో కలిశారని అందుకు బాధపడేదేమీలేదని అన్నారు. ఆయనను తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. సమైక్యవాదులతో కలబడి, నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్క కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
'ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చే అవగాహన తమకు మాత్రమే ఉంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా, ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉందని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలు అవకాశం ఇస్తే పదేళ్ల పాటు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా లక్ష్యం ప్రకారం పని చేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలు పొందాదామని' మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం కార్యకర్తలు, నాయకులు కేసీఆర్‌తో ఫొటోలు దిగేందుకు బారులు తీరారు. వచ్చిన ప్రతి ఒక్కరితో కేసీఆర్ ఫొటోలను దిగారు. మరోవైపు కేటీఆర్‌తో కూడా కార్యకర్తలు ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌లతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయి వారితో కేసీఆర్ మాట్లాడారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పాల్గొన్నారు.
కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో - Ex CM KCR Drive a Car