ETV Hyderabad Bureau Chief Adinarayana Last Rites in Jubilee Hills : సీనియర్ పాత్రికేయులు, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఈటీవీలో దాదాపు 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆది నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆది నారాయణ స్వగ్రామం ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం పెద యాచవరం.
రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాల్లోనే డిగ్రీ వరకూ చదువుకున్నారు. పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో ఈటీవీలో విలేకరిగా చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆది నారాయణ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ సానుభూతి తెలిపారు.
సంతాపం ప్రకటించిన మంత్రులు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణరావు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. ఆదినారాయణ మరణించారన్న సమాచారం తన మనసును కలచివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నివాళి : ఆదినారాయణ పాత్రికేయ రంగంలో చిత్తశుద్ధి పాటిస్తూ, నిస్వార్థంగా సేవలందించారని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆదినారాయణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు మియాపూర్‌లో ఆదినారాయణ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.