Fake Votes Removed in GHMC : హైదరాబాద్ మహా నగరంలో ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రక్షాళన చేసింది. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటరు జాబితాను సవరించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో లక్షా 81 వేల 405 మంది ఓటర్ల వివరాలను సవరించి, 5 లక్షల 41 వేల 201 ఓట్లను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.
2023 జనవరి నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు ఓటరు జాబితాను విశ్లేషించి, చనిపోయిన వ్యక్తులు, డూప్లికేట్స్, చిరునామా మార్పునకు సంబంధించిన ఓట్లను తొలగించినట్లు రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అందులో చనిపోయిన వ్యక్తులు 47 వేల 141 ఓట్లు, చిరునామా మార్పులో 4 లక్షల 39 వేల 801 ఓట్లు, డూప్లికేట్‌లో 54 వేల 259 ఓట్లు తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు.
Fake Votes in Hyderabad : అలాగే వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, వారిని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చి ఓటు వేసేలా 3 లక్ష 78 వేల 713 మంది ఓట్లను సవరించినట్లు రోనాల్డ్ రాస్ వెల్లడించారు. ఓటరు జాబితాలో ఇంటి నెంబర్ల అవకతవకలను గుర్తించి జిల్లాలోని 1 లక్ష 81 వేల 405 ఓటర్ల వివరాలను సరిదిద్దినట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా సికింద్రాబాద్‌లో 31 వేల 42, కంటోన్మెంట్‌లో 22 వేల 732, యాకత్‌పురాలో 19 వేల 909, ముషీరాబాద్‌లో 19 వేల 700, జూబ్లీహిల్స్‌లో 14 వేల 429 ఓట్లను సరిచేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎలక్షన్ కమిషన్ అన్ని ఎర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో పాటు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత నియోజకవర్గ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. మే 13న పోలింగ్ చేపట్టి, జూన్4న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్తీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.