Election Commission Seizures Rs. 34 crore in AP: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు విడుదల నుంచి ఇప్పటి వరకూ రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ ముఖేష్ కుమార్ మీనా వెల్లడిచారు. ఈసీకి చెందిన సి-విజిల్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్టు వివరించారు.
3040 ఫిర్యాదులను పరిష్కరించిన ఈసీ: షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకూ సి-విజిల్ యాప్ ద్వారా 5500 ఫిర్యాదులు అందాయన్నారు. ఎన్నికలకు సంబంధించి 3040 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరించారు. నియమావళి ఉల్లంఘిస్తూ ఏర్పాటైన హోర్డింగులు, ఫ్లెక్సీలపై 1600 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అలాగే ఎన్నికల కోడ్ ఉన్నా అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్న వ్యవహారాలపై 107 ఫిర్యాదులు అందాయన్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో వాహనాల వాడకంపై 43 ఫిర్యాదులు అందాయని స్పష్టం చేశారు. మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29, మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
అధికారులతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, డీజీపీలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతియుతంగా ఎన్నిక నిర్వహణ లక్ష్యంగా 2024 ఎన్నికలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఆయుధాలు, ఉచిత వస్తు పంపిణీని అరికట్టాల్సిందిగా సూచించారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉండాలని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. హింసరహిత ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రాలకు తగినన్ని సాయుధ పోలీసు బలగాలను మోహరించినట్టు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో సాగవుతున్న గంజాయి పొరుగు రాష్ట్రాలకు సరఫరా అవుతోందని సీఈసీ హెచ్చరించారు. నేరగాళ్లు, సంఘవిద్రోహశక్తులపై కన్నేసి ఉంచాల్సిందిగా డీజీపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం పెట్రోలింగ్: బోగస్ ఓట్లు పడకుండా 48 గంటలముందు సరిహద్దు ప్రాంతాలను మూసేయాలని పోలీసులకు సూచనలు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం పెట్రోలింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ రోజున రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాలను మూసేయాలని ఈసీ స్పష్టం చేశారు. లైసెన్సు కలిగి ఆయుధాలను పోలీసుస్టేషన్లలో అప్పగించారో లేదో చూడాలని ఈసీ స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, నేరగాళ్లను అదుపులోకీ తీసుకునేలా నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయాలని ఆదేశించారు. హెలిపాడ్లు, విమానాశ్రయాలు, రైలు, బస్టేషన్లు నగదు రవాణాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సీఈసీ రాజీవ్ కుమార్ ఆదేశించారు. చెక్ పోస్టుల్లో సీసీటీవీలు పెట్టాలని సీఈసీ పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు చర్యలు చేపట్టాలి: ముఖేష్ కుమార్ మీనా - Postal Ballot Home Voting