Election Commission of India : రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎండ తీవ్రత, వడగాలులు ఉన్నందున పోలింగ్ సమయంలో మరో గంట పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని నేతలు సూచించారు.
పార్టీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలోని రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్‌కు అనుమతించాలని సీఈసీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కోరారు. స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ వేసవి తీవ్రత, వడగాలుల ప్రభావంతో పాటు, ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్టోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఏప్రిల్ చివరి వారం నుంచి పరిస్థితి దారుణంగా మారింది. రాబోయే రోజుల్లోనే ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఓటింగ్ సమయాన్ని గంట పెంచింది.
సాధారణంగా ఎలక్షన్ కమిషన్ పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తుంది. పోలింగ్ గడువు ముగియగా అప్పటికే క్యూ లైన్లో నిల్చున్న ఓటర్లను మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఇక నక్సల్ ప్రభావిత సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అయినందున పోలింగ్ సమయాన్ని గంటసేపు పొడిగించారు.
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అదే రోజు జరగనున్నాయి. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
'మోదీ అలా ఎందుకు మాట్లాడారు?'- సమాధానం చెప్పాలని బీజేపీకి ఈసీ ఆదేశం - Lok Sabha elections 2024