80 Years Old Man Completed 21 Post Graduations in Warangal : పిల్లలతో ఓపికగా కబుర్లు చెబుతూ వారడిగే సందేహాలు తీర్చే ఈ పెద్దాయన పేరు అంకతి వీరాస్వామి. ఖిలా వరంగల్ స్వస్థలం. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసినా చదువుపై మమకారంతో స్తంభంపల్లిలో సొంతంగా ఓ ప్రైవేట్ పాఠశాల స్ధాపించారు. ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూనే శ్రమ అనేదే తెలియకుండా ఇష్టంతో పాఠాలు బోధిస్తున్నాడు. తీరిక దొరికితే నాలుగు పుస్తకాలు పట్టుకొని పాఠశాల కలియతిరుగుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తారు.
ఈ పెద్దాయనకి చదువంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల అంతా బాగా చదువుకోవాలన్న తాపత్రయం తనలో బాగా పెరిగింది. ఆ ఆసక్తే ఆయన్ని 21 పీజీలు పూర్తి చేయిచింది. వివిధ సబ్జెక్టుల్లో ఉస్మానియా వర్సిటీ నుంచి 3, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 7, పొట్టిశ్రీరాముల నుంచి 3, ఇగ్నో నుంచి 4 పీజీలను పూర్తి చేశారు. పలు సబ్జెక్టుల్లో మొత్తం 21 పీజీలు పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేశారు.
మరో 4 పీజీలు పూర్తి చేస్తానని ధీమా : విద్యార్థులకు పాఠాలతోపాటు గద్యాలు, పద్యాలు, బుర్రకథలు చెప్పడం వీరాస్వామికి ఎంతో ఇష్టం. రేడియో టీవీల్లో అనేక కార్యక్రమాలు చేశారు. వాటితోపాటు ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 35 మందికి నేత్రదానం చేయించేందుకు అంగీకరింపజేశారు. ఇన్ని చేస్తూ 21 పీజీలు పూర్తి చేసినా ఆయనలో విద్యాతృష్ణ తీరలేదు.
మరో 4 పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నారు వీరాస్వామి. సబ్జెక్టుకి చెందిన ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకుంటూ పరీక్షలు రాసి పాసవుతానని అంటున్నారు. 21 పీజీలు చేసినా తనకు ఏనాడు భారంగా అనిపించలేదని అంటున్నారు. వయస్సు శరీరానికే కాని మనస్సు కాదన్నది ఆ గురువును చూస్తే తెలుస్తోంది. పాఠశాల నడిపిస్తూనే పీజీలు చేస్తూ, చేయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
'నేను 1982 నుంచి పీజీలు చేయడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పీజీలు చేస్తునే ఉన్నా. మొత్తం 21 పీజీలు పూర్తి చేశా. దీనికి మా కుటుంబం సపోర్ట్ కూడా ఉంది. నేనే కాకుండా పాఠశాల టీచర్లతో కూడా పీజీలు చేయిస్తున్నా'- అంకతి వీరాస్వామి
దేశవిదేశాల్లో 70ఏళ్లుగా యోగా ట్రైనింగ్- 93ఏళ్ల ఏజ్‌లోనూ ఏ ఆసనమైనా ఈజీగా! - 93 YEAR OLD YOG TEACHER