ETV Bharat / state

రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 10:19 AM IST

Updated : Jun 8, 2024, 12:02 PM IST

Ramoji Rao Success Story: బహుముఖ ప్రజ్ఞ నిరంతర పరిశ్రమ కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే! ఎప్పుడూ కొత్తదారే!! నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినా మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించినా చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించినా అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించినా రామోజీరావుకే సాధ్యం! లక్ష్యసాధన కోసం దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ramoji_rao_biography
ramoji_rao_biography (ETV Bharat)

Ramoji Rao Success Story : నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నేలకోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక రుషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలూరాత్రి పరిశ్రమించి సృష్టించిన మహాసామ్రాజ్యం రామోజీ గ్రూప్‌!.

అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు రామోజీరావు. విలువుల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజాహృదయాల్ని గెలుచుకున్నారు. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితంకోసం పాటుపడినా మాతృభాష పరిరక్షణకు నడుంకట్టినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దాదాపు లక్ష మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు.

ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగువాకిళ్ల వెలుగుచుక్కలా ప్రభవించే "ఈనాడు" క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం "ఈటీవీ" యావద్భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం "ఈటీవీ భారత్‌" దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే "అన్నదాత" ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనిర్మాణ ప్రాంగణం "రామోజీ ఫిలింసిటీ" అన్నీ రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే.

రామయ్య టు రామోజీ : నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మగారిల్లు. 1936వ సంవత్సరం. నవంబర్ 16. పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజు అది. ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాల రామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి.

పెదపారుపూడి అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు. ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరోదిశగా పచ్చటి పంటచేలు, చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్యపూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మునిసిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి సిక్స్​త్​ ఫాం చదివారు. రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీల్ సామాన్ల కొట్లయినా, ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి? ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా? అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు. రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి.

కమ్యూనిజం- గాంధీయిజం : 1951లో రామోజీ హైస్కూలు చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే BSC పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీమరీ ఇష్టం.

సంఘర్షణ : ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది. డిగ్రీ తర్వాత భిలాయ్‌లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే పదిమందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్దికాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మథనం! అయినా అయిన వాళ్ల కోసం అవకాశాన్ని ఒదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు.

తొలి అడుగు : 1961 ఆగస్టు 19 రామోజీ జీవితంలో కొత్త మలుపు. యుక్త వయసు రావటంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది. కృష్ణాతీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి. రామోజీరావు-రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తనపేరు కొంచెం ఆధునికంగా వుండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య, ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవటం కాకతాళీయమే! వివాహానంతరం, సతీమణి రమాదేవితో కలసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు. దక్షిణ దిల్లీ కరోల్‌బాగ్‌లో నివసించారు.

దిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తను చేసే పని పదిమందికీ ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్దకుమారుడు కిరణ్ పుట్టిన తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ దిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు.

విజయానికి 'మార్గదర్శి' : రామోజీ రావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్‌ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. 'మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే' అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది.

చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీ రావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో కచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు. అవే మార్గదర్శిని దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3లక్షలకు పైగా ఖాతాదారులు, 4వేల100 మందికిపైగా ఉద్యోగులు, 18వేలకుపైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి.

రైతుబిడ్డగా రుణం తీర్చుకోవాలని : మార్గదర్శితో రామోజీ రావు విజయయాత్రలో తొలి అడుగుపడింది. అయినా ఆయన ఏనాడూ మూలాలకు దూరంగా వెళ్లలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత! 1969లో మీడియా రంగంలో తొలి అడుగువేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారథిని నిర్మించారు. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారమిచ్చారు. మూస విధానాలు దాటి ఏనాడూ ప్రయోగాల జోలికివెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్తబాట పట్టించింది. అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకుని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరతీసేలా ప్రోత్సహించింది. అలా కర్షకులకు దిక్సూచిలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది.

తెలుగునాట నవోదయం : తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్‌ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటివరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాలవారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో, మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాతికాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి.

జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తనచుట్టూ జరిగే చిన్నచిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తర్వాతికాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో 'ఈనాడు ముందడుగు' ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు.

స్వచ్ఛభారత్‌, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జలసంరక్షణ కోసం ఊరూవాడను ఏకం చేశారు. ఇలా దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రజాఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాదిమంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగువారందరినీ వార్తా, విజ్ఞాన, వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది ఈనాడు. రామోజీరావు విజయయాత్రలో ఈనాడుతోపాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితార సినీపత్రిక, చతుర, విపుల సాహితీ పత్రికలు.

రుచితో బంధం-ప్రియా : భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశదేశాలకూ పరిచయం చేశారు రామోజీ రావు. 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. పచ్చళ్ల నుంచి చిరుతిళ్ల వరకు వందల రకాల ఉత్పత్తులతో, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందింది ప్రియా ఫుడ్స్. ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు దక్కించుకుంది. ఇదే రీతిలో రామోజీరావు ప్రారంభించిన డాల్ఫిన్‌ హోటల్స్‌ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఈటీవీ- మీ టీవీ! : టీవీ అంటే దూరదర్శన్‌ అని మాత్రమే తెలిసిన రోజుల్లో “ఈటీవీ.. మీ టీవీ" అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతికాలంలోనే జాతీయస్థాయి నెట్‌వర్క్‌గా విస్తరించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్ధం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్‌, ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తికిరీటంలో చేరాయి.

తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సరికొత్త ఒరవడి సృష్టిస్తే బుల్లితెర విషయంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది ఈటీవీ. వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. పాడుతా తీయగా అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీతజల్లు కురిపించడమైనా టాలీవుడ్ క్లాసిక్ మూవీస్‌తో సినీ ప్రేమికుల్ని కట్టిపడేయడమైనా ఖతర్నాక్ కామెడీ షో అంటూ ఇంటింటా జబర్దస్త్ నవ్వులు పూయించడమైనా ఈటీవీకి మాత్రమే సాధ్యం! ఈటీవీలో వచ్చే షోస్ మట్టిలో మాణిక్యాలను వెలికితీసే వేదికలు. పాడుతా తీయగా, ఢీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా తమ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియచెప్పుకుని, అవకాశాలు పొంది వినోద ప్రపంచంలో రారాజులుగా వెలుగొందుతున్న సామాన్యులు ఎందరో!

ఈఎఫ్​ఎం- మీ ఎఫ్​ఎం : సరదా కబుర్లు, సుస్వరాల జల్లుతో నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీ రావు ప్రారంభించిన మరో వేదిక ఎఫ్‌ఎం రేడియో. అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్‌గా మారింది ఈ-ఎఫ్‌ఎం. ఇలా రేడియో, పత్రిక, టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ రావు 2019లో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్‌ను ప్రారంభించారు. ఇదే తరహాలో ప్రేక్షకుల అరచేతిలోనే వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించేలా అద్భుతమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఈటీవీ విన్‌ ఓటీటీ తీసుకొచ్చారు.

కథే నా హీరో : వెండితెరపైనా రామోజీరావు ముద్ర అజరామరం. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కావని మనసును కదిలించే భావాలని నిరూపించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. స్ఫూర్తిదాయక, సమాజహిత కథే కథానాయకుడిగా సాగే తన చిత్రాలు చైతన్యదీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా రామోజీ రావు పరిచయం చేసినవారిలో ఎంతోమంది నటులు అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్నారు.

సినీ మంత్రనగరి : రామోజీరావు కన్న ఓ కల భారతీయ చలనచిత్ర రంగం స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది. ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ యావత్‌ సినీజగత్తు హైదరాబాద్‌వైపు చూసేలా చేసింది. చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకేచోట అందిస్తూ రామోజీరావు నిర్మించిన చిత్రనగరి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. సువిశాల ప్రాంగణం ముగ్ధమనోహరమైన ఉద్యానవనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మయసభను తలపించే సెట్టింగులు కలిగిన రామోజీ ఫిలిం సిటీ సినిమాల చిత్రీకరణకు వేదికవ్వడమే కాక దేశంలో అత్యంత ప్రజాదరణగల పర్యటక కేంద్రంగా వర్ధిల్లుతోంది.

నేను సైతం : అనుక్షణం ప్రజాహితం రామోజీరావు అభిమతం. అక్షరాలే అస్త్రాలుగా ప్రజాచైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు. 1977లో దివిసీమ ఉప్పెన దెబ్బకు నామరూపాల్లేకుండా పోయిన పాలకాయతిప్పలో నిర్మించిన 112 ఇళ్లు 1996లో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లోని తుపాను బాధిత పల్లెల్లో కట్టించిన 42 పాఠశాల భవనాలు 1999లో ఒడిశాలోని కొనగుళ్లిలో తుపాను పీడితుల కోసం నిర్మించిన 60 నివాసాలు2001లో గుజరాత్ భూకంపం, 2004లో తమిళనాడులో సునామీ విధ్వంసం తర్వాత కట్టించిన ఇళ్లు రామోజీ రావు సేవానిరతికి సాక్ష్యాలు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్‌లోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్‌పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్థుల జీవనశైలిని మెరుగుపరిచింది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్ జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపుర్‌మెట్‌లో కట్టించిన పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం రామోజీ గ్రూప్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు. రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానూ మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. రమాదేవి పబ్లిక్ స్కూల్‌ ద్వారా విద్యారంగంలోనూ ప్రత్యేక ముద్ర వేశారు.

తెలుగు వెలుగు : మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం రామోజీ రావు చేపట్టిన మరో మహాయజ్ఞం. పరాయి భాషలపై మోజు తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మభాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటిచెప్పే బృహత్‌ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. లాభాపేక్షలేని రామోజీ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. భావిభారతాన్ని ముందుకు నడిపే బాలల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఎంతో అవసరమని భావించే రామోజీ రావు వారికోసమూ ప్రత్యేక పత్రిక అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలభారతం ద్వారా చిన్నారుల్లో జ్ఞానం, సృజన, ప్రగతిశీల ఆలోచనా విధానం వంటి గుణాల్ని అలవర్చే ప్రయత్నం చేశారు.

పద్మవిభూషణుడు : మీడియాలో రామోజీ రావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1987 ఏప్రిల్‌లో ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీ రావు. పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయెంకా, యుధ్‌వీర్‌ పురస్కారాలు అందుకున్నారు. 1986లో ఆంధ్రవిశ్వ కళా పరిషత్‌ ఆయన్ను డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం 2015 సెప్టెంబర్‌లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించడం ఆ సాటిలేని కృషీవలుడికి లభించిన సముచితమైన గౌరవం!

రామోజీరావు కీర్తి అజరామరం: చంద్రబాబు - Chandrababu On Ramoji Rao Demise

తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - Ramoji Rao Services to Telugu Media

మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field

Last Updated : Jun 8, 2024, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.