EdVenture Park in Hyderabad for Business : ఉన్నతస్థాయికి ఎదగాలంటే మిగతా వారి కంటే భిన్నంగా ఏదైనా సాధించాలని నమ్మారా యువత. అందుకో విన్నూత మార్గం ఎంచుకున్నారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారి సందేహాలు నివృత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కొంగొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తూ వారిలో ప్రజ్ఞను వెలికితీసి అంకుర సంస్థల ఏర్పాటుకు తోడుగా ఉంటున్నారు. నగరంలోని మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ సమీపంలో ఉన్న ఎడ్వెంచర్ పార్క్ కార్యాలయంలో ప్రతి నెలా మొదటి శుక్రవారం ఫౌండర్స్ ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 200కు పైగా అంకురసంస్థల ప్రారంభానికి ఊతం ఇచ్చారు. ఆలోచనలతో వచ్చేవారు, స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి అవకాశాలు కల్పిస్తోంది ఫౌండర్స్ ఫ్రైడే. ఆర్థిక, టెక్నికల్, మార్కెటింగ్, బిజినెస్ పార్టనర్స్ ఇలా రకరకాల సేవలు ఎడ్వెంచర్ పార్క్ అందిస్తోంది. ఇక్కడ నిర్వహించే బిజినెస్ షవర్స్ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమంది ప్రేరణ పొంది అంకురాలు స్థాపించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న యువత గత నెలలో 5 రకాల యాప్‌లు రూపొందించి మెరుగైన సేవలు అందిస్తున్నారు.
ఆర్థిక అంశాలపై ఫైనాన్స్ అకాడమీ డాట్ యాప్ : గ్రామీణప్రాంతం నుంచి నిత్యం వైద్యం కోసం వేలాది మంది పట్టణాలకు వస్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని హ్యాపీ క్యూర్స్ వెబ్ సైట్ తయారు చేశాడు కోనాపూర్‌కు చెందిన నితిన్. ఈ యాప్‌తో రోగులకు డాక్టర్ల గురించి కచ్చితమైన సమాచారం అందుతుందని చెప్తున్నాడు. ప్రస్తుతం నగర ఆసుపత్రులలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింప చేయటమే లక్ష్యమని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. కానీ వారి ఆర్థిక కారణాల వల్ల ముందుకెళ్లలేని పరిస్థితి.
అలాంటి వారి కోసమే ఆర్థిక అంశాలకు సంబంధించి ఫైనాన్స్ అకాడమీ డాట్ యాప్ రూపొందించింది హైదరాబాద్‌కు చెందిన సంస్కృతి. చిన్న వయసు నుంచే అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను తయారుచేశానని, అందరికీ ఆర్థిత అక్షరాస్యత కల్పించడమే తన ఉద్దేశమని చెబుతోంది. మొక్కలు పెంచడం అంటే చాలా మందికి ఆసక్తి. అలాంటి వారి కోసం షోబగీచా వెబ్ సైట్ రూపొందించాడు హైదరాబాద్‌కు చెందిన షోయబ్. ఈ యాప్‌తో నాణ్యమైన మొక్కలు కనుక్కోవడానికి సులువుగా ఉంటుందని చెబుతున్నాడు. నచ్చిన మొక్కలను ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతున్నాడు.
అంకుర సంస్థల ఏర్పాటుకు తోడ్పాటుగా : ఆటిజంతో బాధపడుతున్న పిల్లల పెంపకం తల్లిదండ్రులకు కత్తిమీద సామే, అలాంటి వారి కోసం లీజా రోటా యాప్ ద్వారా వైద్య సాయం పొందే అవకాశం కల్పించాడు హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం రజాఫ్. ఈ యాప్ ద్వారా తక్కువ ధరలోనే చికిత్స పొందొచ్చని చెబుతున్నాడు. కుంగుబాటుతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు పొందెందుకు గుడ్ మైండ్ యాప్‌కు రూపకల్పన చేసింది సానీయ. మానసిక స్థితి మంచిగా లేని వారు ఏ నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిదో సూచిస్తోంది.
ఇలా భిన్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చిన ఔత్సాహికులకు ఎడ్వెంచర్ సంస్థ నిపుణులు దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్‌లో వారు అంకుర సంస్థలు ఏర్పాటు చేసి రాణించేందుకు తగిన తోడ్పాటు అందిస్తున్నారు. వ్యాపారంలో రాణించాలని కలలు కనే యువత ఈ అవకాశాన్ని ఉపయెగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు,
'ప్రతి నెల మొదటి శుక్రవారం ఫౌండర్స్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తాం. సిటీ నుంచి చాలా మంది వస్తారు. ప్రతి శుక్రవారం ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం బిజినెస్ షవర్స్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ల బిజినెస్ ప్రారంభం కోసం సాయం చేస్తాం'- మిరాజ్, ఎడ్వెంచర్ పార్క్ సీఈవో
YUVA - చేపలపై యువ పరిశోధకుడి రీసెర్చ్ - వరల్డ్ జర్నల్స్‌లో కథనాలు - Young Man Research on Fishes