Telangana DSC Exam Rules Relaxation : ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను విద్యా శాఖ విడుదల చేసింది. గత కొంత కాలంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి పరీక్షా షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు, ఆగస్టు 5వ తేదీతో ముగుస్తాయి. అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసేవారికి విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థి ఇక ఒకే ప్రాంతంలో పరీక్షను రాసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే, అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్ష సైతం రాయొచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్‌లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH ON DSC EXAMS
స్పందించిన విద్యాశాఖ అధికారులు, అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇక్కడ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి : డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 18 నుంచి సీబీటీ విధానంలో టెస్ట్ నిర్వహించనుంది. సీబీటీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.