ED Intensify the Investigation of Mahipal Case : పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమార్జన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థ ద్వారా అక్రమ మైనింగ్‌కు తెల లేపి రూ.300 కోట్ల మేర సంపాదించినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ సొమ్మును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలో ఏయో సంస్థల్లో పెట్టుబడులగా పెట్టారో దాని సమచారాన్ని మూలాలలను సమగ్రంగా తెలుసుకునేందుకు కార్యచరణ రూపొందించింది. దీంతో మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. లభ్యమైన భూదస్తావేజులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
వాటిలో చాలావరకు దస్త్రాలు ఇతరుల పేర్లపై రిజస్ట్ అయ్యి ఉండడంతో వారిని బినామీలుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ భూములు తమవేనని చెబితే వాటి కొనుగోళ్లకు నగదు ఎలా సమకూర్చుకున్నారో అన్న అంశంపై ఆరా తీయనున్నారు. మనీలాండరింగ్ నిరోధన చట్టం (పీఎంఎల్‌ఏ) కేసు కావడంతో బీనామీలుగా ఉన్నవారు నోరు తప్పక తెలవాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాంగ్మూలపై నెలకొన్న ఉత్కంఠ : అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆనావాళ్లు ఎక్కడా రికార్డుల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారని ఈడీ ఇప్పటికే గుర్తించింది. క్వారీలో కంకర విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకోవడం ఇందుకు కారణమని అనుమానిస్తోంది. సంస్థ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది. భూదస్తావేజుల రట్టు వీడితేనే అక్రమార్జన పెట్టుబడుల డొంక కదులుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బినామీలు ఇవ్వనున్న వాంగ్మూలాలపై ఉత్కంఠ నెలకొంది. అలాగే మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిస్తే మరింత కీలక సమాచారం లభిస్తుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.