EC Will Suspend Prakasam and Palnadu District SPs : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వీటికి బాధ్యులైన ప్రకాశం, పల్నాడు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న మరికొంత మంది ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుల పైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు ఈసీ ఆదేశాలు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మునయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇమాం హుస్సేన్‌ను అంతమొందించారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్త ఇర్ల సురేష్ కారును దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు ఇటీవల సీఈవో ముకేశ్‌కుమార్ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఈవో మీనా దీనిపై సీఈసీకి నివేదిక పంపించారు. దాని ఆధారంగా కొంతమంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.
జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌పై డీజీపీ సమాధానం చెప్తారా ? : లోకేశ్ - LOKESH QUESTIONED TO DGP
దీంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన 'ప్రజాగళం' సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నివేదిక పంపించారు. ఆ రోజు సభలో భద్రత పరంగా ఏ లోపాలు చోటుచేసుకున్నాయి? వాటికి కారకులు ఎవరు? విధి నిర్వహణలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు.
ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, గుంటూరు ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకరరెడ్డిలే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 18న బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. విధులు సరిగ్గా నిర్వహించక పోవటం, సహాయ నిరాకరణ వల్లే ఇబ్బందులు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని సభకు తగిన భద్రత కల్పించలేదని, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలను గాలి కొదిలేశారని పొందుపరిచారు.
ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సీఈవో ముకేశ్‌కుమార్ మీనాను ఇటీవల ఆదేశించింది. తదనుగుణంగా ఆయన విచారణ జరిపించి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా కొంతమంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.
వైసీపీ అభ్యర్థులపై అసంతృప్తి - చల్లారని కలహాల కుంపట్లు - Revolt Against YCP Candidates